Phool makhana chivda: ఫూల్ మఖానాతో చుడ్వా.. ఆరోగ్యకరమైన స్నాక్
Phool makhana chivda: ఫూల్ మఖానాతో ఆరోగ్యకరమైన స్నాక్ రెసిపీయే ఫూల్ మఖానా చుడ్వా. అటుకులకు బదులుగా ఫూల్ మఖానా వాడి దీన్నెలా తయారు చేయాలో చూడండి.
ఫూల్ మఖానా చుడ్వా
ఫూల్ మఖానా పాలలో వేసుకుని లేదంటే నేరుగా తినడం చేస్తుంటాం. కానీ దాంతో రోజూవారీ తినే స్నాక్ కూడా చేసుకోవచ్చు. ఫూల్ మఖానాతో చుడ్వా చేశారంటే హెల్తీ స్నాక్ రెడీ అవుతుంది. సాధారణంగా చుడ్వా లేదా చివ్‌డా అటుకులతో తయారు చేస్తారు. కానీ ఫూల్ మఖానాతోనూ రుచిగా చేసేయొచ్చు. ఎలాగో చూడండి.
ఫూల్ మఖానా చుడ్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
3 కప్పుల ఫూల్ మఖానా
3 చెంచాల నూనె
పావు కప్పు పల్లీలు
పావు కప్పు పుట్నాలు
పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, పొడవుగా కట్ చేసుకోవాలి
4 ఎండు మిర్చి
1 కరివేపాకు రెమ్మ
2 చెంచాల బాదాం
2 చెంచాల జీడిపప్పు
సగం చెంచాడు పసుపు
అరచెంచా కారం
సగం చెంచా ఉప్పు
ఫూల్ మఖానా చుడ్వా తయారీ విధానం:
- ముందుగా ఒక కడాయిలో చెంచాడు నూనె వేసుకుని కాస్త వేడి అవ్వనివ్వాలి.
- అందులో మఖానా వేసుకుని సన్నం మంట మీద ఫ్రై చేసుకోవాలి. కనీసం పది నిమిషాలు సన్నం మంట రోస్ట్ చేస్తేనే అవి క్రిస్పీగా అవుతాయి.
- ఒకటి చేతులోకి తీసుకుని నలిపితే కరకరమంటూ విరిగిపోవాలి. అలా అయితే స్టవ్ కట్టేయొచ్చు. ఇలా వేయించకపోతే చుడ్వా తినలేరు.
- మఖానా పక్కన పెట్టేసి అదే కడాయిలో మరో రెండు లేదా మూడు చెంచాల నూనె వేసుకోవాలి.
- అందులో వేరుశనగ, జీడిపప్పు, బాదాం వేసుకుని రంగు మారేదాకా వేయించాలి.
- పుట్నాలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి మరో నిమిషం వేగనివ్వాలి. ఇవేవీ మాడి పోకుండా చూసుకోవాలి.
- అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా వేసి కలుపుకోవాలి.
- వీటిని చల్లారాక మంచి బిగుతు మూత ఉన్న డబ్బాలో వేసి పెట్టరంటే రెండు వారాల దాకా నిల్వ ఉంటాయి.