Oil less cooking: అప్పడాలు, చిప్స్ చుక్క నూనె వాడకుండానూ వేయించొచ్చు, సీక్రెట్ ట్రిక్స్ ఇవే-how to fry papad fries and chips without oil using salt and other methods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oil Less Cooking: అప్పడాలు, చిప్స్ చుక్క నూనె వాడకుండానూ వేయించొచ్చు, సీక్రెట్ ట్రిక్స్ ఇవే

Oil less cooking: అప్పడాలు, చిప్స్ చుక్క నూనె వాడకుండానూ వేయించొచ్చు, సీక్రెట్ ట్రిక్స్ ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Sep 03, 2024 02:00 PM IST

Oil less cooking: మనమందరికీ క్రంచీ అప్పడాలు, చిప్స్, మురుకులు తినడం అంటే ఇష్టమే. కానీ ప్రతిరోజూ నూనెలో వేయించి తినడం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఒక చిన్న చిట్కాతో రుచికరంగా, నూనె వాడకుండా వీటిని చేసుకోవచ్చు.

నూనె లేకుండా అప్పడాలు
నూనె లేకుండా అప్పడాలు (Shutterstock)

క్రంచీగా, స్పైసీగా అప్పడాలు, చిప్స్, పాపడ్ ఎవరికైనా ఇష్టమే. పప్పు, సాంబార్ లాంటి వాటిని అన్నంలో కలుపుకుని ఇవి పక్కన లేకుండా తినలేరు చాలా మంది. అలాగే సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ చేయాలన్నా చాలామంది టక్కుమని వీటిని నూనెలో తీసి చేసిచ్చేస్తారు. అలా నూనెలో తీసిన ప్రతిసారీ ఎక్కువగా వాడేస్తున్నాం అనిపిస్తుంది. వీటితో ఆరోగ్యం మీదా ప్రభావం ఉంటుంది. అందుకే అసలు చుక్క నూనె వాడకుండా వీటిని రుచిగా ఎలా చేసుకోవచ్చో తెల్సుకోండి.

ఉప్పుతో

ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులో ఉప్పు వేసుకుండి. మీడియం మంట మీద పెట్టుకుని దాన్ని వేడి అవ్వనివ్వండి. ఉప్పు బాగా వేడెక్కాక అందులో అప్పడాలు, ఫ్రైయుమ్స్ లాంటివి వేసి నూనెలో వేయించినట్లే పైకి కిందికీ చెంచాతో అంటుండాలి. ఆ ఉప్పు వేడికి ఈ అప్పడాలు వేగిపోతాయి. రుచిగానూ ఉంటాయి. పాపడ్ మాత్రం ఉప్పులోపల మునిగిపోయినట్లు ఉండేలా చూసుకుంటే తొందరగా వేగిపోతుంది. అలాగే ఈ ఉప్పు ఒక్కసారి వాడాక భద్రపర్చుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. బిస్కట్లు, కేకులు చేస్తున్నప్పుడు ఈ ఉప్పు వాడి వాటిని బేక్ కూడా చేయొచ్చు.

కాల్చడం

మినప్పప్పుతో, బియ్యం పిండితో చేసిన అప్పడాలు మరో రకంగానూ తినొచ్చు. పుల్కాలు చేసే స్టాండ్ ఉంటే దాన్ని గ్యాస్ మీద పెట్టండి. దాని మీద అప్పడం పెట్టి నేరుగా కాల్చుకుని తినొచ్చు. నూనెలో వేయించిన దానికన్నా ఈ రుచి అద్భుతంగా ఉంటుంది. మీద కూరగాయల ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కారం వేసుకుని తిన్నారంటే ఇలా చేసిన మసాలా అప్పడం రుచి అదిరిపోతుంది.

ఎయిర్ ఫ్రైయర్

మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే, మీకు ఈ ఉప్పు ట్రిక్ అవసరం లేదు. మీరు మంచి ఎయిర్ ఫ్రైయర్ మీద పెట్టుబడి పెట్టగలిగితే ఖచ్చితంగా కొనేయండి. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో మీరు నూనె లేకుండా దాదాపు ప్రతిదీ తయారు చేసుకోవచ్చు. బెండకాయ, ఆలూ లాంటి కూరగాయల వేపుడులు, కబాబ్స్, చిప్స్, గారెలు.. ఇలా ప్రతిదీ ఎయిర్ ఫ్రైయర్ లో నూనె లేకుండా చేసుకోవచ్చు.

ఓవెన్

ఓవెన్ లో కూడా నూనె లేకుండా పాపడ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ లో పాపడ్ పెట్టి హై టెంపరేచర్ మీద ఓవెన్ సెట్ చేసుకోవాలి. ఒక పది సెకన్లు ఆగి బయటకు తీశారంటే క్రంచీ పాపడ్ రెడీ అవుతుంది. ఎక్కువ సేపు ఉంచితే కాలిపోతుందని గుర్తుంచుకోండి.

టాపిక్