Peas Paneer Pulao: పచ్చి బటానీ, పన్నీర్ పులావ్.. రుచిలో వావ్..
Peas Paneer Pulao: పన్నీర్, పచ్చి బటానీలతో చేసే పులావ్ రుచి అమోఘంగా ఉంటుంది. దాన్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసి చేసేయండి.
మటర్ పన్నీర్ పులావ్ (flickr)
మార్కెట్లో పచ్చిబటానీలు బాగా దొరికే సమయం ఇది. తాజా బటానీలతో రుచికరంగా పులావ్ చేసుకుని చూడండి. చాలా బాగుంటుంది. కాస్త హెవీగా తినాలనుకుంటే పన్నీర్ ముక్కలు కూడా జోడించి మరింత రుచిగా చేసుకోవచ్చు. దాన్ని పొడిపొడిగా, రుచిగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు బాస్మతీ బియ్యం
1 కప్పు పన్నీర్ కప్పులు
1 కప్పు పచ్చి బటానీ
2 చెంచాల నెయ్యి
1 ఉల్లిపాయ, పొడవుగా ముక్కలు కోసుకోవాలి
అరచెంచా అల్లం తరుగు
అరచెంచా వెల్లుల్ల తరుగు
సగం కప్పు టమాటా గుజ్జు
సగం చెంచా నిమ్మరసం
కొద్దిగా కొత్తిమీర
తగినంత ఉప్పు
1 బిర్యానీ ఆకు
2 లవంగాలు
అరచెంచా జీలకర్ర
చిన్న దాల్చిన చెక్క ముక్క
పావు చెంచా పసుపు
పావు చెంచా గరం మసాలా
అరచెంచా కారం
అరచెంచా ధనియాల పొడి
తయారీ విధానం:
- ముందుగా బియ్యాన్ని కడుక్కుని నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
- ప్రెజర్ కుక్కర్‌లో నెయ్యి వేసుకుని వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త రంగు మారేదాక వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేదాక వేగనివ్వాలి.
- అందులోనే టమాటా గుజ్జు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులోనే పచ్చి బటానీ, పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి.
- అవి కాస్త వేగాక ఒకటిన్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, మిగిలిన మసాలాలు వేసుకుని ఒకసారి కలియబెట్టాలి.
- ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మూత తీసి కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని ఒకసారి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే సరి.
- ఏదైనా రైతాతో సర్వ్ చేస్తే ఈ మటర్ పన్నీర్ పులావ్ అదిరిపోతుంది.