Pilot Suicide : ఎయిర్ ఇండియా పైలట్ ఆత్మహత్య.. వేధింపులే కారణం.. ప్రియుడి అరెస్టు!
Air India Pilot Suicide : ప్రియుడితో గొడవల కారణంగా ముంబయిలో ఓ పైలట్ ఆత్మహత్య చేసుకుంది. ఆమెను తరచూ బాయ్ ఫ్రెండ్ వేధించేవాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులి ఎయిర్ ఇండియాలో పైలట్‌గా చేస్తుంది. ముంబయిలోని అంధేరిలో నివాసం ఉంటుంది. ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ అనే 27 ఏళ్ల యువకుడితో ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. పైలట్ అయిన తులి అంధేరిలో తాజాగా తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ప్రాథమిక విచారణలో ఆమె ప్రియుడి వేధింపులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఆదివారం అపార్ట్‌మెంట్‌లో తులి, పండిట్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పండిట్ దిల్లీకి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకుంటానని తులి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పండిట్ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. తలుపు లోపల నుంచి వేసి ఉంది. దీంతో ఓ వ్యక్తిని పిలిపించి తెరిపించాడు. అప్పటికే తులి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు పండిట్. కానీ ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఆమె డేటా కేబుల్‌తో ఉరివేసుకుని చనిపోయిందని, అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆదిత్య పండిట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పండిట్ తులిని బహిరంగంగా తరచుగా వేధించేవాడని, అవమానించేవాడని తులి మామ ఆరోపించారు. తన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, మాంసాహారం తీసుకోవడం మానేయాలని కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చాడని ఆయన పేర్కొన్నారు.
గతేడాది జూన్ నుంచి తులి ముంబైలో నివసిస్తుంది. రెండేళ్ల క్రితం దిల్లీలో కమర్షియల్ పైలట్ కోర్సు చదువుతున్నప్పుడు పండిట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తులి కుటుంబం ఫిర్యాదు చేయడంతో పండిట్‌ను BNS సెక్షన్ 108 కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడిని నాలుగు రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.