Accident: ఘోర రోడ్డు ప్రమాదం; కారు- ట్రక్కు ఢీకొని ఐదుగురు డాక్టర్లు మృతి
Accident: ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ నిద్ర పోవడంతో.. ఆ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్యులు చనిపోయారు.
Doctors killed: ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ నగరానికి సమీపంలో లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ వేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్న దారిలోకి దూసుకెళ్లి తిర్వాలోని పాయింట్ 196 సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
వివాహానికి వెళ్లి వస్తూ..
మృతులంతా ఓ వివాహానికి హాజరయ్యేందుకు లక్నో వెళ్లిన వైద్యులేనని తిర్వా సర్కిల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక బాజ్ పాయ్ ధ్రువీకరించారు. లక్నో నుంచి ఎటావాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతులను ఆగ్రాకు చెందిన డాక్టర్ అనిరుధ్ శర్మ (29). రవి దాస్ నగర్ కు చెందిన సంతోష్ మౌర్య(30). కన్నౌజ్ కు చెందిన అరుణ్ కుమార్ (32). బరేలీకి చెందిన నరేంద్ర గంగ్వార్ (32). బిజ్నోర్ కు చెందిన రాకేశ్ సింగ్ (36) గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పీజీ స్టూడెంట్ జైవీర్ సింగ్ ను వైద్య విశ్వవిద్యాలయానికి తరలించారు.
డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో..
డాక్టర్లంతా తమ సహోద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు ఎస్ యూవీలో లక్నోకు వెళ్లారని పోలీసులు తెలిపారు. వాహనం అతివేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు సమాచారం. దీంతో వాహనం లేన్ డివైడర్ ను ఢీకొనడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న రాజస్థాన్ నుంచి వస్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో, కారులో ప్రయాణిస్తున్న వైద్యులు (doctor) తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిందని ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.