హమ్మయ్య.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం-israel approves ceasefire agreement with hezbollah comes into effect from today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హమ్మయ్య.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం

హమ్మయ్య.. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం

Anand Sai HT Telugu
Nov 27, 2024 11:20 AM IST

Israel Hezbollah ceasefire agreement : అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హిజ్బుల్లా అంగీకరించాయి. బుధవారం నుంచి ఈ షరతులు అమల్లోకి రానున్నాయి.

ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ
ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీకాలం చివరి రోజుల్లో గొప్ప విజయాన్ని సాధించారు. గత 10 నెలలుగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ వేశారు. ఈ రోజు ఉదయం నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికా, ఫ్రాన్స్ భాగస్వామ్యం వహించాయి. కాల్పుల విరమణకు సంబంధించి లెబనాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ హిజ్బుల్లా ప్రతినిధి ఎవరూ లేరు.

కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్ ఒక విషయం స్పష్టం చేసింది. హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము వారి ప్రదేశంలోకి ప్రవేశించి దాడి చేస్తామని చెప్పింది. వెనక అడుగు వేయబోమని స్పష్టం చేసింది. ఇరాన్, గాజాలపై దృష్టి సారించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని అంగీకరించామని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది.

ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ 10-1 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటితో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించినట్లు బైడెన్ వెల్లడించారు. హిజ్బుల్లా, ఇతర ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ భద్రతలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు.

ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలో లెబనాన్ సైన్యం నియంత్రణను ఉపసంహరించుకోవడంతో 60 రోజుల్లో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకుంటుందని బైడెన్ చెప్పారు. హిజ్బుల్లా అక్కడ తన స్థావరాన్ని పునర్నిర్మించుకోకుండా చూడాలి. ఇరు దేశాల పౌరులు త్వరలోనే సురక్షితంగా ఇళ్లకు చేరుకోగలుగుతారని బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే హిజ్బుల్లా ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తామని ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం నెతన్యాహు చెప్పారు.

అయితే నెతన్యాహు తన ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల నుంచి ఈ ఒప్పందంపై వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్‌లపై దృష్టి సారించడానికి, ఆయుధాల ఎగుమతులను భర్తీ చేయడానికి, దళాలకు విశ్రాంతి ఇవ్వడానికి అవకాశం లభిస్తుందని నెతన్యాహు అన్నారు. ఒప్పందాన్ని అమలు చేస్తామని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా దీటుగా స్పందిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. 'గెలిచే వరకు కలిసికట్టుగా పనిచేస్తాం. హిజ్బుల్లా యుద్ధం ప్రారంభంలో ఉన్న దానికంటే ఇప్పుడు బలహీనంగా ఉంది. దశాబ్దాలుగా దాన్ని వెనక్కి నెట్టివేశాం, సరిహద్దుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం.' అని నెతన్యాహు చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ అధికారులతో కొన్ని నెలలుగా చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ ఒప్పందంపై సంతకం చేయడమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ లెబనాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Whats_app_banner