Oats bellam payasam: ఓట్స్‌‌తో బెల్లం పాయసం చేసి చూడండి, రుచి మర్చిపోలేరు-how to make oats bellam payasam recipe for snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Bellam Payasam: ఓట్స్‌‌తో బెల్లం పాయసం చేసి చూడండి, రుచి మర్చిపోలేరు

Oats bellam payasam: ఓట్స్‌‌తో బెల్లం పాయసం చేసి చూడండి, రుచి మర్చిపోలేరు

Koutik Pranaya Sree HT Telugu
Sep 22, 2024 03:30 PM IST

Oats bellam payasam: ఓట్స్, బెల్లం కలిపి ఇలా పాయసం చేయండి. ఓట్స్‌తో చేసినట్లు కూడా తెలీనంత రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్ గా, చుట్టాలొస్తే స్వీట్ గా చేసేయొచ్చు. ఓట్స్ బెల్లం పాయసం రెసిపీ చూడండి.

ఓట్స్ బెల్లం పాయసం
ఓట్స్ బెల్లం పాయసం

ఓట్స్‌తో ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే చాలా మంది ప్రతి రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ ఏదో ఒక రకంగా భాగం చేసుకుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు ఇది చాలా మేలు. అయితే ఓట్స్‌తో ఉప్మానే కాకుండా ఒకసారి ఓట్స్ పాయసం ప్రయత్నించండి. షుగర్ ఉన్నవాళ్లు దీంట్లో బెల్లానికి బదులు మరేదైనా స్వీటెనర్ వాడుకోవచ్చు. పిల్లలైతే ఓట్స్ అని గుర్తుపట్టకుండా ఇష్టంగా తినేస్తారు. ఓట్స్ పాయసం తయారీ ఎలాగో వివరంగా చూడండి.

ఓట్స్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:

ముప్పావు కప్పు ఓట్స్

2 చెంచాల నెయ్యి

ఒకటిన్నర కప్పు కొబ్బరి పాలు

2 యాలకులు

1 కప్పు నీళ్లు

1 చెంచా జీడిపప్పు పలుకులు

1 చెంచా పచ్చి కొబ్బరి ముక్కలు

ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము లేదా బెల్లం పొడి

ఓట్స్ పాయసం తయారీ విధానం:

1. ముందుగా కడాయి పెట్టుకుని సన్నం మంట మీద ఉంచాలి. అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడెక్కాక ఓట్స్ వేసుకోవాలి. సన్నం మంట మీద ఓట్స్ వేయించుకోవాలి.

2. రంగు కొద్దిగా మారి మంచి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.

3. ఇప్పుడు మరో పాత్రలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగేదాకా కలపాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

4. చల్లారాక బెల్లం నీళ్లను ఒకసారి వడగడితే ఏవైనా నారలుంటే, రాళ్లుంటే తీసేయొచ్చు.

5. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఓట్స్‌లో ఈ బెల్లం పానకం కలిపేయాలి. దాంతో పాటే కొబ్బరి పాలూ పోసేయాలి.

6. ఇదంతా పొయ్యి మీద పెట్టి కనీసం రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఓట్స్ మెత్తగా అయిపోతాయి. బెల్లం కూడా బాగా కరిగి కలిసిపోతుంది.

7. చివరగా యాలకులు పొడి వేసుకుని కలుపుకుని స్టవ్ కట్టేయాలి.

8. మరో పాత్రలో నెయ్యి వేసుకుని స్టవ్ మీద పెట్టాలి. వేడెక్కాక జీడిపప్పు వేయించుకుని తీసుకోవాలి. అలాగే కాస్త చిన్నగా తరుగుకున్న కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేయించి తీయాలి. రంగు మారి మంచి వాసన వస్తాయి.

9. వీటిని ఉడికించుకున్న ఓట్స్ మిశ్రమంలో కలిపేసుకుంటే ఓట్స్ పాయసం రెడీ అయినట్లే.

ఓట్స్ లో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పీచు అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువ ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువ. ఇన్ని లాభాలతో పాటూ పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ కూడా ఓట్స్ ద్వారా లభిస్తుంది. కొన్ని తిన్నా చాలా సేపు కడుపు నిండిన భావన ఓట్స్ తింటే కలుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఓట్స్ మంచి ఆహారం. ఆరోగ్యకరం.

టాపిక్