Banaras Tomato chat: నీతా అంబానీకి ఇష్టమైన.. బనారస్ టమాటా చాట్ రెసిపీ..-how to make neetha ambani favorite banaras tomato chat at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banaras Tomato Chat: నీతా అంబానీకి ఇష్టమైన.. బనారస్ టమాటా చాట్ రెసిపీ..

Banaras Tomato chat: నీతా అంబానీకి ఇష్టమైన.. బనారస్ టమాటా చాట్ రెసిపీ..

Banaras Tomato chat: బనారస్ లోని టమాటా చాట్ దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందింది. తాజాగా నీతా అంబానీ కూడా దీన్ని రుచి చూశారు. ఇది ఎంత రుచిగా ఉంటుందో తయారు చేయడం కూడా అంతే సులభం. ఈ రుచికరమైన చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

బనారస్ టమాటా చాట్ రెసిపీ (Shutterstock and ANI)

ఆధ్యాత్మికంగా కాశీ లేదా బనారస్ నగరం ఎంత ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. దాంతో పాటే ఇక్కడి వీధులు, అక్కడ దొరికే ఆహారం కూడా దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందింది. వాటిలో ఒకటి బనారస్ టమాటా చాట్. ఇటీవల నీతా అంబానీ కాశీకి చేరుకోగానే ఆమె కూడా షాపులో కూర్చొని ఈ రుచికరమైన చాట్ ను రుచి చూశారు. ఆమెకు చాట్ బాగా నచ్చింది, దాన్నెలా తయారు చేయాలో దుకాణదారుడిని కూడా అడిగాడు. బనారస్ కు చెందిన ఈ పుల్లని తీపి టమోటా చాట్ రుచి ఎంత అద్భుతంగా ఉందంటే విదేశాల నుంచి ప్రజలు దీనిని తినడానికి వస్తుంటారు. ఈ చాట్ సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇంట్లో కూర్చొని బనారసి చాట్ ను ఆస్వాదించొచ్చు.

బనారస్ టమాటా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

6 టమోటాలు

5 ఉడికించిన బంగాళాదుంపలు

2 చెంచాల నెయ్యి

1 చెంచా తురిమిన అల్లం

1 టీస్పూన్ జీలకర్ర

1 టీస్పూన్ పసుపు

అరచెంచా జీలకర్ర పొడి

అరచెంచా ధనియాల పొడి

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

7 నుండి 8 జీడిపప్పు

గసగసాలు - 1/2 టీస్పూన్

చింతపండు గుజ్జు లేదా ఆమ్‌చూర్ పొడి

సరిపడా ఉప్పు

నల్ల ఉప్పు లేదా బ్లాక్ సాల్ట్

కారం

కొత్తిమీర తరుగు

నిమ్మకాయ రసం

బనారస్ టమాటా చాట్ తయారీ విధానం:

  1. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర, తురిమిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, గసగసాలు వేసుకోవాలి. ఒకవేళ గసగసాలు లేకపోతే వదిలేయొచ్చు.
  2. ఇందులో కాస్త చిన్న ముక్కలుగా దంచుకున్న జీడిపప్పు ముక్కలు వేయాలి. వాటిని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి.
  3. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, మరి కొంత నల్ల ఉప్పు లేదా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇపుడు మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
  4. టమాటాల నుంచి నీళ్లు రావడం మొదలవుతుంది. అప్పుడు అరకప్పు నీళ్లు పోసుకోవాలి. గరం మసాలా వేసుకుని కనీసం అయిదు నిమిషాలు మళ్లీ ఉడికించాలి.
  5. టమాటాలు బాగా ఉడికిపోయాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా మెదుపుకుని అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వత అందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు బదులుగా పులుపు కోసం ఆమ్‌చూర్ పొడి కూడా వేసుకోవచ్చు.
  6. అన్నీ కలియబెట్టి కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మరో రెండు నిమిషాలు ఉడికిస్తే టమాటా చాట్ రెడీ అవుతుంది.
  7. అలాగే మరో ప్యాన్ తీసుకుని అందులో పంచదార పాకం చేసుకోవాలి. చాట్‌ పుల్లగా, తియ్యగా ఉండటానికి ఇది అవసరం. ప్యాన్‌లో కప్పు నీళ్లు, 5 చెంచాల పంచదార వేసుకోవాలి. పంచదాకా కరిగేదాకా ఉడకనివ్వాలి. కాస్త చిక్కబడ్డాక అందులో జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి.
  8. ఇప్పుడు చాట్ ఎలా సర్వ్ చేయాలో చూడండి. ముందుగా గిన్నెలో టమాటా మిశ్రమం వేసుకోవాలి. మీద నిమ్మకాయ రసం, చాట్ మసాలా కలపాలి. పైన చెంచా పంచదార సిరప్ వేసుకోవాలి. అంతే బనారస్ ఫేమస్ తియ్యటి, పుల్లని టమాటా చాట్ రెడీ..