How To Make A Kite । గాలిపటం ఇలా తయారు చేయండి.. ఈ సంక్రాంతికి ఆకాశమే హద్దు!
How To Make A Kite: సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయటం ఒక సాంప్రదాయం, ఒక సరదా. గాలిపటాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉపాయాలు చూడండి.
Makara Sankranti: సంక్రాంతికి సంబరాలు మొదలయ్యాయి. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది, ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగువారి వాకిళ్ళు అందమైన రంగవల్లులతో ఎంత అందగా కనిపిస్తాయో, ఆకాశంపైన హరివిల్లు విచ్ఛిన్నమై పువ్వులుగా వెదజల్లబడిందా? అన్నట్లుగా రంగురంగుల గాలిపటాలు ఎగురుతుంటాయి. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయటం ఒక సాంప్రదాయం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తారు. గుజరాత్ రాష్ట్రంలో గాలిపటాల పోటీలను కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ కైట్ ఫెస్టివల్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ సంక్రాంతికి కొన్నిరోజుల ముందు నుంచే గాలిపటాలు ఎగరేయటం చూడవచ్చు. పట్టణాలు, నగరాలలో గాలిపటాలు ఎక్కువ ఎగరేస్తారు, హైదరాబాద్ నగరంలో అయితే పతంగుల పండగ మామూలుగా ఉండదు, ఇక్కడ కూడా సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ ప్రతియేటా నిర్వహిస్తారు.
పతంగులు ఎగరేయటం ఒక సరదా క్రీడ, పతంగులతో పోటీలు పెట్టడం, ఒక పతంగితో మరో పతంగిని డీల్ మార్.. కీంచ్ కట్ అంటూ కట్ చేయడం ఎంతో మజానిస్తుంది. మరి మీరూ పతంగులు ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నారా? పతంగులు మీకు మీరుగా మీకు నచ్చినట్లుగా కూడా తయారు చేసుకోవచ్చు, పేపర్- దారం ఉంటే చాలు పతంగి రెడీ. గాలిపటాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ ఉపాయాలు చూడండి.
How To Make A Kite- గాలిపటం తయారు చేయడంలో దశలు
ముందుగా పతంగి తయారీకి కావలసిన మెటీరియల్స్ సిద్ధం చేసుకోండి. మీకు పతంగి తయారీకి ఒక తేలికైన పేపర్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్, రెండు సన్నని వెదురు బద్ధ కర్రలు, సరిపడినంత దారం, అతికించడానికి జిగురు అవసరం అవుతాయి.
స్టెప్ 1: ముందుగా తేలికైన పేపర్ లేదా తేలికైన పాలిథీన్ కవర్ తీసుకోండి. పేపర్ ఎలాంటి రంధ్రాలు లేకుండా కాస్త వెడల్పుగా చతురస్రాకారంలో ఉండాలి. లేదా పతంగి ఆకారంలో పేపర్ కట్ చేసుకోండి.
స్టెప్ 2: చతురస్రాకారంలో ఉన్న కాగితాన్ని తీసుకుని ఒకవైపు రెండు అంచులను కలుపుతూ సరళ రేఖ గీయండి. డైమండ్ ఆకారపు లైన్ గీయండి.
స్టెప్ 3: ఇప్పుడు కొబ్బరిచీపురు పుల్లలా ఉండే వెదురుబద్ధలను తీసుకోండి. ఒక వెదురు బద్ద చిన్నగా, మరొకటి పెద్దగా ఉండాలి. పొడవాటి వెదురుబద్ధ వంచేలా ఉండాలి. చిన్నవెదురు బద్దను కాగితం మధ్య నుంచి వెళ్తూ రెండు అంచులను కలిపేలా అతికించండి.
స్టెప్ 4: ఇప్పుడు పొడవాటి వెదురుబద్ధను క్రాస్ మార్క్ లేదా వంగిన శిలువ గుర్తులాగా అమర్చాలి. పొడవాటి వెదురు బద్ధను మధ్యలో కాకుండా కాస్త పైకి జరిపి వంచుతూ కాగితం మరో రెండు చివరలను కలిపేలా అతికించాలి.
స్టెప్ 5: ఒప్పుడు రెండు వెదురుబద్ధలు కలిసే చోట, అవి దగ్గరగా జరిపి కట్టుకట్టాలి. అక్కడ రెండు కన్నాలు పెట్టి దారంను రెండు వరుసలుగా చేసి చుట్టాలి.
స్టెప్ 6: ఇప్పుడు క్రాస్ మార్క్ చేసిన చుట్టిన రెండు వరుసల దారాన్ని వెదురుబద్దలకు వెనకవైపుగా తీసుకొని క్రాస్ మార్క్ కిందివైపు ఒక ఫీట్ కంటే తక్కువ వరకు లాగి అక్కడ కన్నాలు చేసి, ముడి వేయాలి, తెరచాప ఆకృతి వచ్చేలా కట్టాలి.
స్టెప్ 7: గాలిపటానికి తెరచాప లాగా దారం చుట్టిన తర్వాత దాని చివరన చిటికెన వేలు పరిమాణం ఖాళీ స్థలం వదిలి ముడివేయాలి. మిగిలిన కాగితం ముక్కలతో తోకను సిద్ధం చేయాలి.