Washing Machine: వాషింగ్ మెషీన్ ఇలా వాడితే ఎన్నేళ్లయినా పాడవ్వదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే-how to maintain washing machine for long durability ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Washing Machine: వాషింగ్ మెషీన్ ఇలా వాడితే ఎన్నేళ్లయినా పాడవ్వదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Washing Machine: వాషింగ్ మెషీన్ ఇలా వాడితే ఎన్నేళ్లయినా పాడవ్వదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Sep 22, 2024 02:00 PM IST

Washing Machine: వాషింగ్ మెషీన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని మన్నిక పెరుగుతుంది. తరచూ ఏ ఇబ్బందులూ రాకుండా ఉంటాయి. వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలేంటో చూడండి.

వాషింగ్ మెషీన్ వాడకంలో జాగ్రత్తలు
వాషింగ్ మెషీన్ వాడకంలో జాగ్రత్తలు (pixabay)

గతంతో పోలిస్తే ఇప్పుడు అందిళ్లలోనూ వాషింగ్‌ మషీన్‌లు ఉంటున్నాయి. అయితే వీటిని వాడేప్పుడు ఎలా మెయింటెన్‌ చేయాలనే దానిపై సరైన అవగాహనతో ఉండాలి. లేదంటే దాని జీవత కాలం తగ్గిపోతుంది. మరమ్మతులు ఎక్కువ అయి చికాకు పెడతాయి. దాని మన్నికని పెంచే చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.

వాషింగ్ మెషీన్ వాడకంలో జాగ్రత్తలు:

లోడ్ విషయంలో జాగ్రత్త:

లోడ్‌ ఎంత వేయాలనే విషయంలో కచ్చితమైన స్పష్టతతో ఉండండి. ఇన్‌స్టాలేషన్‌ సమయంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వస్తారు కదా. వారితో మాట్లాడి ఎన్ని దుస్తుల్ని వేయాలనే దానిపై అవగాహనతో ఉండండి. కొందరు మషీన్‌ డోర్‌ వరకూ దుస్తుల్ని నింపేస్తుంటారు. అలా కాకుండా దాని కెపాసిటీని బట్టి వేయాల్సి ఉంటుంది. సాధారణంగా మూడొంతులు దుస్తులు ఉంటే ఒక వంతు ఖాళీ ఉండాలని గుర్తుంచుకోండి. అప్పుడే నీరు నింపుకుని ఉతుక్కోవడానికి దానికి కాస్త ఖాళీ ఉంటుంది. దీంతో పాటే..

1. ఇన్‌స్ట్రక్షన్‌ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అవగాహన పెంచుకోండి.

2. లింట్‌ ఫిల్టర్‌ని, నీరు వెళ్లే ఇన్‌లెట్‌ దగ్గర ఉండే వాటర్‌ ఫిల్టర్‌ని వారానికి ఒకసారైనా క్లీన్‌ చేసుకోండి. లేదంటే దుమ్ము వాటిలో ఇరుక్కుపోయి ఇబ్బంది అవుతుంది. అలాగే కొన్నింటికి రబ్బర్‌ గ్యాస్‌కెట్లు ఉంటాయి. వాటినీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

3. దుమ్ము, ధూళి, ఎండ నుంచి వాషింగ్‌ మెషీన్‌కి రక్షణ కల్పించండి. అది దాని జీవిత కాలాన్ని తప్పకుండా పెంచుతుంది. అవసరం అయితే దానిపై కవర్‌ని వేసుకోండి.

4. నెలకోసారైనా ఫుల్‌ సైకిల్‌ పెట్టేసి ఖాళీ వాషింగ్‌ మషీన్‌ని తిరగనివ్వండి. గంట పాటైనా అలా వదిలేయండి. అప్పుడు దాని డ్రమ్‌ని దానికదే క్లీన్‌ చేసుకుంటుంది. లేదా సెల్ఫ్ క్లీన్ ఆప్షన్ ఉంటే అదీ వాడొచ్చు.

5. కొందరు దుస్తులు ఉతకడం అయిపోయాక కూడా చాలా సమయం వరకు వాటిని అందులోనే ఉంచేస్తుంటారు. అలా గంటల తరబడి తడి దుస్తుల్ని అందులోనే ఉంచేయడం వల్ల దాని పనితీరు క్రమేణా తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.

6. ఏ వాషింగ్‌ మషీన్‌కి తగినట్లుగా దానికి లిక్విడ్‌ని వాడుకోవడం తప్పనిసరి. అలా కాకుండా సర్ఫ్‌నీ, వేరే దానికి సంబంధించిన లిక్విడ్‌లనూ ఇందులో వాడుకోవడం దీని పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ మెషీన్లకు వేరు వేరు డిటర్జెంట్ లిక్విడ్లను వాడాలి.

7. ఇన్‌ లెట్‌, ఔట్‌ లెట్‌ పైపుల్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

8. దీనిలో వేయడానికి ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌ని వాడుతుంటారు కదా. అది ఇన్‌స్ట్రక్షన్స్‌ని చదివి ఎంత వేయాలో అంతే వేయండి. ఎక్కువగా వేయడం వల్ల వాషింగ్‌ మషీన్‌లోని భాగాలు కొన్నాళ్లకు దెబ్బతింటాయని గుర్తుంచుకోండి.

9. డ్రమ్‌లో పొరపాటున డిటర్జెంట్‌ ఉండిపోయినట్లయితే దాన్ని తీసి వేయండి. అలాగే వదిలేస్తే డ్రమ్‌ పాడవుతుంది.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వాషింగ్‌ మషీన్‌ మెయింటనెన్స్‌ చాలా తేలిక అయిపోతుంది. దానితో ఎక్కువ ఇబ్బందులు తలెత్తవు.

Whats_app_banner