అలవాటుకు, వ్యసనానికి చాలా తేడా ఉంది. చెడు అలవాట్లు మానడం కాస్త తేలికే. కానీ వ్యసనంలా మారితే బయటపడటం కష్టం. అలాంటి వాటిలో అశ్లీల వీడియోలు లేదా పార్న్ వీడియోలు చూడటం కూడా ఒకటి. ఇంటర్నెట్, ఫోన్ సదుపాయం సులువవ్వడం వల్ల వయసుతో సంబంధం లేకుండా వీటికి అలవాటు పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నా మానలేని స్థితిలోనూ కొందరుంటారు. దీంతో అపరాధ భావం చుట్టు ముట్టేస్తుంది. దీని ప్రభావం రోజూవారీ జీవితం మీదా పడుతుంది.
అశ్లీల వీడియోలకు బానిసలుగా మారారా లేదా అని ముందుగా గుర్తించాలి. ఈ వీడియోలు చూడటం వ్యసనంగా మారితే మరింత ప్రమాదకరం. దాని లక్షణాలు..
మీ ఫోన్‌కి పేరెంటల్ లాక్ పెట్టుకోండి. దీంతో అది చెడు వీడియోలు మీరు చూడాలనుకున్న ప్రతీసారీ మీరు చూడలేరని గుర్తు చేస్తుంది. పేరెంటల్ లాక్ సాధారణంగా పిల్లల జాగ్రత్త కోసం వాడతారు. కానీ దాన్ని వాడితే మీకూ ఉపయోగకరంగా ఉంటుంది. దానికున్న పాస్‌వర్డ్ కొట్టే క్షణంలో అయినా మీరు దీన్నుంచి బయటపడాలి అనుకుంటున్నారని గుర్తు చేస్తుంది.
ప్రతి వ్యసనానికి, అలవాటుకు ఓ కారణం ఉంటుంది. ఇలాంటి వీడియోలు కూడా మీకు ఏదో ఒక కారణం వల్ల చూడటం అలవాటు అవ్వొచ్చు. ఒంటరిగా ఉండటం, ఒత్తిడి, బాధ, డిప్రెషన్ నుంచి బయటపడటానికి, బోరింగ్ గా ఫీల్ అవుతున్నప్పుడు.. ఇలా దేనివల్ల మీకు ఆ వీడియోలు చూడాలి అనిపిస్తుందో కారణం తెల్సుకోండి. దీంతో ఈ అలవాటు మానుకోవచ్చు.
మంచి అలవాట్లు మనిషిని సుందర రూపంగా మార్చేస్తాయి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆటలు ఆడటం, వ్యాయామం, వాకింగ్ చేయడం ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. మీ మనసులో, ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది. ధ్యానం చేయడం వల్ల మీ మనసు మీద మీకు నియంత్రణ పెరుగుతంది.
ముందుగా మీదగ్గర హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు ఉంటే వాటిని డిలీట్ చేయండి. బుక్ మార్క్ చేసి పెట్టుకున్న హిస్టరీ ఉంటే దాన్నీ తొలగించండి. మీ దగ్గర ఏదైనా వెబ్‌సైట్లు, పుస్తకాలు, మేగజైన్లకు సంబంధించిన డేటా ఉంటే దాన్నీ తీసేయండి. ఇవన్నీ కాస్తయినా సాయపడతాయి. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే తక్షణమే మీరు ఈ పని చేయండి.
మంచైనా, చెడైనా ఏ అలవాటైనా ఉన్నట్లుండి మార్చుకోవడం కష్టం. దేనికైనా సమయం పడుతుంది. కాబట్టి క్రమంగా బయటపడండి. మానేయలేకపోతున్నాం అని ఆందోళన పడకండి. మీ మీద మీకు నియంత్రణ తెచ్చుకుంటే తొందరగా బయటపడతారు.
వ్యసనం అనేది ఒంటరితనంలో తరచుగా తలెత్తుతుంది. కాబట్టి దీన్నుంచి బయటపడటానికి ఖాళీ సమయంలో ఒంటరిగా ఉండటానికి బదులుగా, మీకు దగ్గరగా ఉన్న వారితో సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ దృష్టి మళ్లుతుంది.
అనేక ప్రయత్నాల తర్వాత కూడా మీ వ్యసనం వదిలించుకోవడానికి ప్రయత్నించినా అది పెరుగుతుంటే నిపుణుడిని సంప్రదించాలి. భయపడే బదులు, మీ వ్యసనం మానడం మీద దృఢ నిర్ణయంతో ఉండాలి. వీటితో పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, వ్యాయామం కూడా చేయాలి.