Joint Pains: ఈ 5 వ్యాయామాలతో కీళ్లనొప్పులకు చెక్ పెట్టేయండి..-how to exercise with joint pain 5 low impact exercises for pain relief ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains: ఈ 5 వ్యాయామాలతో కీళ్లనొప్పులకు చెక్ పెట్టేయండి..

Joint Pains: ఈ 5 వ్యాయామాలతో కీళ్లనొప్పులకు చెక్ పెట్టేయండి..

HT Telugu Desk HT Telugu
Aug 25, 2023 10:26 AM IST

Exercises for Joint Pains: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ వ్యాయామాలు చేసి సమస్యను అదుపులో ఉంచుకోండి.

కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ వ్యాయామాలు తెలుసుకోండి
కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? ఈ సింపుల్ వ్యాయామాలు తెలుసుకోండి

వయసుతో సంబంధం లేకుండా చాలామంది కీళ్లనొప్పులతో బాధడుతున్నారు. ఒకప్పుడు వయసుతో పాటు ఈ సమస్య వచ్చేది. ఇప్పుడు వివిధ కారణాలతో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అందరూ దీని బాధితులవుతున్నారు. మీరు కూడా ఈ కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ సింపుల్ వ్యాయామాలు చేసి సమస్యను అదుపులో ఉంచుకోండి.

కీళ్లలో కలిగే అసౌకర్యం లేదా నొప్పినే కీళ్ల నొప్పులు అంటాము. ఈ సమస్య ఉన్నవారు సరిగా ఏ పని చేయలేరు. ఎందుకంటే శరీరం అంతగా సహకరించదు. ఒక్కసారి ఈ సమస్య ప్రారంభమైందంటే అంత సులువుగా వదిలిపోదు. కానీ రోజూవారీ జీవితంలో కొన్ని వ్యాయామాలు ప్రారంభిస్తే ఈ సమస్య అదుపులో ఉంటుంది. పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందంటున్నారు నిపుణులు.

చిన్న నొప్పే కదా అని అశ్రద్ధ చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు కీళ్ల నొప్పులు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. వారి సూచనలతో పాటు కొన్ని వ్యాయామాలు చేయండి. దీనికోసం మీరు జిమ్ లకు వెళ్లాల్సిన అవసరమేమి లేదు. ఇంట్లో ఉంటూనే వీటిని మీరు ఈజీగా సాధన చేయవచ్చు. ఇంతకీ కీళ్ల నొప్పులను అదుపులో ఉంచే వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నడక

వ్యాయామాల్లో నడక అనేది తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. అయినా సరే ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. రోజూ నడిస్తే.. మీ కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. అంతేకాకుండా జాయింట్స్ కదలికలు మెరుగవుతాయి. ఇవి కీళ్ల అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బరువును నియంత్రణలో ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కూడా నడక ముఖ్యపాత్ర పోషిస్తుంది.

సైక్లింగ్

మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటే మీరు కచ్చితంగా సైక్లింగ్ ను రోజూ చేయండి. ఇది మీ కీళ్లకు మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది. అంతేకాకుండా కాలు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జాయింట్ మొబిలిటీని మెరుగుపరిచి కీళ్ల నొప్పులను దూరం చేసి.. మోకాళ్ల దృఢత్వాన్ని పెంచుతుంది.

స్విమ్మింగ్

కీళ్ల నొప్పుల నివారణకు స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది మీ కీళ్లపై ఒత్తిడి లేకుండా పూర్తి శరీర వ్యాయామాన్ని అందిస్తుంది. మీ శరీరంపై ఎలాంటి బరువు పడకుండా తేలికగా ఉండేలా నీరు మద్దతు ఇస్తుంది. కాబట్టి మీ వ్యాయామం మీ కీళ్లపై ఎక్కువ ప్రభావం చూపించకుండా పూర్తి శరీరానికి మద్ధతునిస్తుంది. ప్రతీరోజూ స్విమ్మింగ్ చేయడం వల్ల కీళ్ల సమస్య తగ్గి.. కండరాల బలం మెరుగుపడుతుంది.

స్ట్రెచింగ్

మీ రోజువారీ వ్యాయామ దినచర్యలో స్ట్రెచింగ్ వ్యాయామాలను చేర్చండి. దీన వల్ల మీ కీళ్ల కదలిక మెరుగవుతుంది. కండరాల ఒత్తిడి తగ్గుతుంది. తద్వార కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తుంటి, భుజాలు, మోకాళ్లను లక్ష్యంగా చేసుకుని సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయొచ్చు. కానీ వ్యాయామం చేసేటప్పుడు మీ కీళ్లపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోండి.

రెసిస్టెన్స్ ట్రైనింగ్

రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, లైట్ వెయిట్‌లు లేదా బాడీ వెయిట్ వ్యాయామాలు మీ కీళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని మెరుగుపరుస్తాయి. వాటిపై అధిక ఒత్తిడి లేకుండా మెరుగైన స్థిరత్వాన్ని అందిస్తాయి. రెసిస్టెన్స్ బ్యాండ్‌లతో చెస్ట్ ప్రెస్, లెగ్ ప్రెస్, ట్రైసెప్ ప్రెస్ , స్క్వాట్స్, లెగ్ రైజ్ మొదలైన వ్యాయామాలు చేయవచ్చు. ఇవి మీ కీళ్లపై ఒత్తిడి కలిగించకుండా రిలీఫ్ అందిస్తాయి.

వీటితో పాటు బ్యాలెన్సింగ్ వ్యాయామాలు, స్క్వాట్స్, లంగ్స్ వంటి వ్యాయామాలపై దృష్టి సారిస్తే.. కీళ్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Whats_app_banner