Millets biryani: మిల్లెట్స్‌తో ఇలా బెస్ట్ బిర్యానీ చేసేయండి.. డయాబెటిస్ పేషెంట్లకు మంచి రెసిపీ-how to cook millets mixed veg biryani for diabetes patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millets Biryani: మిల్లెట్స్‌తో ఇలా బెస్ట్ బిర్యానీ చేసేయండి.. డయాబెటిస్ పేషెంట్లకు మంచి రెసిపీ

Millets biryani: మిల్లెట్స్‌తో ఇలా బెస్ట్ బిర్యానీ చేసేయండి.. డయాబెటిస్ పేషెంట్లకు మంచి రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Aug 16, 2024 06:30 PM IST

Millets biryani: డయాబెటిస్ ఉన్నవాళ్లు బిర్యానీకి దూరంగా ఉంటారు. రుచికరమైన వంటలేమీ తినడానికి ఉండవనుకుంటారు. కానీ ఒకసారి ఇలా చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్‌తో బిర్యానీ చేసుకుని చూడండి. మామూలు బిర్యానీ రుచి కూడా మర్చిపోతారు. మీ రుచిని సంతృప్తి పరిచే ఈ బిర్యానీ రెసిపీ తయారీ, కావాల్సిన పదార్థాలు చూడండి.

మిల్లెట్స్ బిర్యానీ
మిల్లెట్స్ బిర్యానీ

బిర్యానీ అంటే ఎంత ఇష్టం ఉన్నా షుగర్ ఉన్నవాళ్లు ఎక్కువగా తినలేరు. కానీ వాళ్ల ఆరోగ్యాన్ని మరింత పెంచేలా చిరుధాన్యాలతో కూడా బిర్యానీ వండుకోవచ్చు. పండగపూట మంచి రుచికి డయాబెటిస్ మిమ్మల్ని దూరం చేయకూడదు. ప్రత్యేక సందర్భాల్లో ఏదైనా తినాలనిపిస్తే ఈ మిల్లెట్స్ మిక్స్డ్ వెజ్ బిర్యానీ చేసి చూడండి. మీకిష్టమైన ఏదైనా చిరుధాన్యం దీనికోసం వాడొచ్చు.

మిల్లెట్స్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు చిరుధాన్యం (సామలు, కొర్రలు, ఊదలు.. ఏవైనా తీసుకోవచ్చు)

1 కప్పు కూరగాయల ముక్కలు (బీన్స్, క్యారట్, క్యాలీఫ్లవర్, బటానీ.. అన్నీ కలిపి తీసుకోవాలి)

2 చెంచాల నూనె

1 చెంచా నెయ్యి

1 బిర్యానీ ఆకు

2 పచ్చిమిర్చి

2 ఉల్లిపాయల తరుగు

1 టమాటా ముక్కలు

2 కప్పుల నీళ్లు

పావు చెంచా పసుపు

తగినంత ఉప్పు

గుప్పెడు కొత్తిమీర తరుగు

గుప్పెడు పుదీనా ఆకుల తరుగు

మసాలా కోసం:

ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు

అంగుళం అల్లం ముక్క

1 చెంచా కారం

1 చెంచా ధనియాల పొడి

సగం ఉల్లిపాయ ముక్కలు

1 చెంచా జీలకర్ర

మిల్లెట్స్ బిర్యానీ తయారీ విధానం:

  1. ముందుగా చిరుధాన్యం తీసుకుని కడుక్కోవాలి. దాంట్లో నీళ్లు పోసుకుని పది నిమిషాలు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లి, అల్లం ముక్క, కారం, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని మెత్తగా పట్టుకోవాలి. దాంట్లో రెండు చెంచాల నీళ్లు పోసుకుని పట్టుకుంటే మసాలా ముద్ద తయారవుతుంది.
  3. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని అందులో నూనె, నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  4. టమాటాలు కూడా వేసుకుని మరో నిమిషం ఉడికించాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. ఒక నిమిషం నూనెలో వేయించాక అన్ని కూరగాయల ముక్కలు వేసుకుని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు చిరుధాన్యం కూడా వేసుకుని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టాలి. కప్పు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి.
  6. సన్నం మంట మీద కనీసం పదినిమిషాలు ఉడికించుకోవాలి. లేదంటే రెండు విజిల్స్ వచ్చినా సరిపోతుంది.
  7. చివరగా కొత్తిమీర, పుదీన ఆకుల తరుగు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మిల్లెట్స్ బిర్యానీ రెడీ. దీన్ని రైతాతో, లేదా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.