Millets pulihora: ఎలాంటి చిరుధాన్యంతో అయినా.. పులిహోర చేసే పద్ధతిదే..-millets pulihora recipe in details with measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Millets Pulihora: ఎలాంటి చిరుధాన్యంతో అయినా.. పులిహోర చేసే పద్ధతిదే..

Millets pulihora: ఎలాంటి చిరుధాన్యంతో అయినా.. పులిహోర చేసే పద్ధతిదే..

HT Telugu Desk HT Telugu
Sep 07, 2023 12:46 PM IST

Millets pulihora: రకరకాల చిరుధాన్యాలతో పులిహోర తయారీ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. మిల్లెట్స్ కూడా రుచికరంగా తినే విధానాల్లో ఇది కూడా ఒక మంచి వంటకం.

మిల్లెట్స్
మిల్లెట్స్ (pexels)

కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు.. ఇలాంటి చిరుధాన్యాలు ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యకరం. వీటినే మిల్లెట్స్ అంటాం. వీటితో కేవలం జావ మాత్రమే చేసుకునే తాగాల్సిన పనిలేదు. రకరకాలుగా రోజూవారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎలాంటి చిరుధాన్యంతో అయినా పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. రకరకాల చిరుధాన్యాలతో ఇదే పద్ధతిలో పులిహోర తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు కొర్రలు/ అరికెలు/ లేదా అన్ని రకాలు కలిపి తీసుకోవచ్చు

1 కప్పు నీళ్లు

సగం కప్పు చింతపండు గుజ్జు

1 చెంచా శనగపప్పు

1 చెంచా నువ్వులు

పావు చెంచా పసుపు

తగినంత ఉప్పు

6 ఎండు మిర్చి

సగం చెంచా ఆవాలు

1 చెంచా మినప్పప్పు

1 కరివేపాకు రెబ్బ

ఒకటిన్నర చెంచాల వంటనూనె

2 చెంచాల వేయించిన పల్లీలు

చిటికెడు ఇంగువ

తయారీ విధానం:

  1. ముందుగా ఏదైనా చిరుధాన్యాన్ని లేదా కొర్రల్ని తీసుకుని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు నీళ్లు తీసుకుని వేడి చేసుకోవాలి. సమయం ఉంటే చిరుధాన్యాల్ని కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. లేదంటే వెంటనే ఉడికించుకోవచ్చు.
  2. నీళ్లు ఒక ఉడుకు వచ్చాక కడుక్కున్న కొర్రల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని సన్నం మంట మీద ఉడకనివ్వాలి.
  3. 5 నిమిషాల్లో నీళ్లు ఇంకిపోయి పొడిపొడిగా కొర్రల అన్నం సిద్ధం అవుతుంది. అలాగే మూత పెట్టి ఉంచేస్తే వేడికి కొర్రలు బాగా ఉడుకుతాయి.
  4. ఇప్పుడు చింతపండు గుజ్జులో 1 చెంచా నీళ్లు, పసుపు వేసుకుుని కలుపుకోవాలి. ఈ రసాన్ని ఉడికించుకున్న కొర్రల అన్నంలో కలుపుకోవాలి.
  5. కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. కొద్దిగా ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ఎండు మిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి.
  6. చివరగా పల్లీలు, కరివేపాకు వేసుకుని ఒక రెండు సెకన్లు ఉంచి తీసేయాలి. ఈ తాలింపును కొర్రల్లో కలుపుకోవాలి.
  7. ఇప్పుడు కొర్రల్ని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి రెండు నిమిషాల పాటూ సన్నని మంట మీద ఉడికించుకుంటే చాలు. కొర్రల పులిహోర సిద్ధం.

Whats_app_banner