Turmeric side effects: వంటల్లో పసుపు ఈ కొలత మించి వాడకండి, తీవ్ర నష్టాలు
Turmeric side effects: కాలేయం దెబ్బతినడం నుండి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం వరకు రోజూ ఎక్కువ పసుపు తినడం వల్ల కలిగే అనేక దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.
పసుపు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పెట్టింది పేరు. యాంటీ ఇన్ఫ్లమేటరీ నుండి శరీరాన్ని నయం చేయడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వరకు దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే దీన్ని వంటల్లో తప్పకుండా చేర్చుకోమని చెబుతారు. నిజంగా పసుపు వాడటం సురక్షితమేనా?
బహుశా కాదు అంటున్నారు క్లినికల్ పీడియాట్రిక్, మహిళా ఆరోగ్య ఫార్మసిస్ట్ క్రిస్టిన్ హిల్. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై దుష్ప్రభాలను చూపుతుందంటున్నారు. ఉదర సంబంధిత సమస్యలతో పాటే, రక్తం పలుచబడటం, కాలేయ సంబంధిత వ్యాధులకూ ఇది కారణం కావచ్చట. ఈ విషయాలన్నీ వివరంగా తెల్సుకుందాం.
ఉదర, జీర్ణ సమస్యలు:
పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనేక దుష్ప్రభావాలలో ఇదీ ఒకటి. ఇది జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. మలబద్దకం, డయేరియా, అజీర్తి, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, పసుపు రంగులో మలం లాంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
స్కిన్ ర్యాషెస్:
అనేక సౌందర్య చికిత్సల కోసం పసుపును విరివిగా వాడతారు. జుట్టుకు పెట్టుకునే ప్యాక్స్, చర్మానికి ఫేస్ ప్యాకుల్లో పసుపు ఎక్కువగానే వాడతారు. అయితే తరచుగా, ఎక్కువ మోతాదులో వాడటం వల్ల చర్మం మీద దద్దుర్లు, ర్యాసెష్ రావచ్చంటున్నారు నిపుణులు. పసుపులో ఉండే కర్కుమిన్ దీనికి కారణం.
రక్తస్రావం:
పసుపు రక్తాన్ని పలుచన చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి రక్తం గడ్డకట్టడానికి, రక్త ప్రసరణ క్రమబద్ధీకరించడానికి అవసరమైన క్యాల్షియం సిగ్నలింగ్‌ను ఇది నిరోధిస్తుంది. దీంతో ఏదైనా గాయం అయినప్పుడు రక్తం గడ్డకుండా రక్తస్రావం ఎక్కువుతుంది. ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, మలం లేదా మూత్రంలో రక్తం కనిపించడం కూడా పసుపు వినియోగం వల్ల వచ్చే దుష్ప్రభావాలు.
చక్కెర స్థాయిలు:
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి, పసుపు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ, ఎక్కువ మోతాదులో పసుపు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం అవుతుంది. ఇది సాధారణ స్థాయిలో చక్కెర స్థాయిలు ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కాలేయం:
అధిక మోతాదులో కర్కుమిన్, చెప్పాలంటే రోజుకు 250-1,800 మి.గ్రా మధ్య తీసుకుంటే అది కాలేయానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. పచ్చ కామెర్లు, కడుపు నొప్పి, వికారం, ముదురు రంగులో మూత్రం ఇవన్నీ కాలేయం దెబ్బతింది అనడానికి సూచనలు. ఈ లక్షణాలకు తక్షణ వైద్య చికిత్స అవసరం.
పసుపు ఎంత తీసుకోవాలి?
అధ్యయనాల ప్రకారం, రోజువారీ 3 గ్రాముల పసుపు వినియోగం ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. 8 గ్రాముల కర్కుమిన్ కలిగిన ఉత్పత్తులను ఏవైనా వాడాల్సి వస్తే రెండు నెలల వరకు ఉపయోగిస్తే మాత్రం అంత ప్రమాదకరం కాదు.