Tea And Diabetes: ఎక్కువ చాయ్ తాగితే టైప్ 2 డయాబెటిస్? నిజమేనా?
Tea And Diabetes: ఎక్కువగా టీ తాగే అలవాటుంటే దాని ప్రభావం మధుమేహం పడుతుందా లేదా అనే సందేహం ఉందా. అయితే ఒక సర్వేతో సహా పూర్తి వివరాలు తెలుసుకోండి.
కాస్త చిరాగ్గా అనిపించినా, కాస్త బద్ధకంగా అనిపించినా, అలసిపోయినట్లు అనిపించినా, కాస్త తల నొప్పిగా అనిపించినా మనందరికీ టీ ఇట్టే గుర్తొచ్చేస్తుంది. చాలా మందికి ఇది లేకుండా రోజే గడవదు. అంతగా ఇది మన జీవితాలలో భాగం అయిపోయింది. ఇలాంటి టీని కొందరు చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఇలా అతిగా టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని ఓ పరిశీలన ద్వారా వెల్లడైంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.
పరిశీలన ఎలా జరిగిందంటే..?
ఓ హెల్త్ బ్యాంకుకు సంబంధించి ఎన్‌రోల్ అయిన హెల్త్ డేటా మొత్తాన్ని కొందరు పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ హెల్త్ డేటాలో మొత్తం 4,82,425 మంది మధుమేహం లేని పేషెంట్లు ఉన్నారు. 30,300 మంది మధుమేహం ఉన్న వారు ఉన్నారు. వీరిలో కొంత మందిని వ్యక్తిగతంగా కూడా ఇంటర్య్వూ చేశారు. వీరు ఏ విధంగా టీ తాగుతున్నారు? అనే విషయాన్ని పరిశోధకులు పరిశీలించారు. వారి టీ తాగే అలవాట్లు, మధుమేహం, మధుమేహం వల్ల వచ్చే సమస్యలు తదితరాలను పరిశీలించి చూశారు. వీరు రోజూ టీ తాగుతున్నారా? అలా కాకపోతే వారంలో ఒకసారైనా టీ తాగుతున్నారా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే ఏ వయసు నుంచి వీరు టీ తాగడం ప్రారంభించారన్న దాన్నీ చూశారు. ఇంకా తేయాకులతో చేసుకునే టీ తాగుతున్నారా? లేదంటే గ్రీన్ టీ తాగుతున్నారా? ఎన్ని కప్పులు తాగుతున్నారు? ఎంత కప్పు తాగుతున్నారు? లాంటి అనేకానేక విషయాలను పరిశీలించారు. మధుమేహ కుటుంబ చరిత్ర ఉందా? అన్న దాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. దీనిలో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫలితాలు ఏంటంటే:
ఎవరైతే రోజూ గ్రీన్ టీ తాగుతున్నారో వారు డయాబెటీస్ బారిన తక్కువగా పడుతున్నారు. అలాగే మధుమేహంతో చనిపోయే ప్రమాదాలూ తక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులూ తక్కువగా వస్తున్నాయి. అలా కాకుండా తేయాకుల టీని ఎక్కువగా తాగే వారిలో దీర్ఘ కాలంలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రోజులో ఎక్కువగా తేయాకుల టీ తాగే వారిలో గ్లూకోజ్ స్థాయిల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు వస్తున్నట్లు తెలుసుకున్నారు. అస్సలు టీ తాగని వారితో పోలిస్తే కొద్దిపాటి టీ తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొద్దిగా టీ తాగే వారితో పోలిస్తే ఎక్కువగా దీన్ని తాగే వారిలో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ మరింత ఎక్కువగా ఉంది. వీరందరి కంటే గ్రీన్ టీ తాగే వారు ఈ ముప్పుకు చాలా దూరంగా ఉన్నట్లు పరిశీలకులు గుర్తించారు. ఈ ఫలితాలన్నింటినీ అంచనా వేసిన తర్వాత.. ఎవరైతే రోజూ టీ తాగే వారు ఉంటారో వారు ఆ అలవాటును వీలైనంతగా తగ్గించుకోవాలని చెప్పారు. తేయాకుల టీ స్థానంలో గ్రీన్ టీని తీసుకోమని వారు సిఫార్సు చేస్తున్నారు.
టాపిక్