Fish in Mustard Curry Recipe । ఆవాల చేపలకూర.. ఆహా అనిపించే రుచి!
Fish in Mustard Curry Recipe: ఆవాల పేస్ట్ గ్రేవీలో చేపలకూర అనేది ఒక క్లాసిక్ బెంగాలీ వంటకం. ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Fish Recipes: చేపలకూర అంటే చాలా మందికి ఇష్టం, అందులోనూ పులస అంటే నోరూరుతుంది. ఇక్కడ మీకు బెంగాలీ శైలిలో వండే పులస చేపల కూర రెసిపీని తెలియజేస్తున్నాం. సోర్షే ఇలిష్ మాచెర్ ఝల్ అనేది ఒక క్లాసిక్ బెంగాలీ వంటకం. ఇది ఇలిష్ లేదా హిల్సా చేపలతో వండుతారు, వీటినే పులస చేపలు అంటారు. అయితే బెంగాలీలు ఆవాల పేస్ట్ గ్రేవీలో వండుతారు. ఈ రుచికరమైన వంటకం చాలా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
హిల్సా లేదా పులస అనేది ఒక కొవ్వుగల చేప, ఇందులో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ, అలాగే ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే వీటిలో ముళ్లు చాలా ఉంటాయి. పులస చేపలు మరికొన్ని రోజుల్లో మాన్‌సూన్ సీజన్‌లో లభిస్తాయి. మీరు పులసకు బదులు సాల్మన్, ట్యూనా ఇతర కొవ్వు చేపలను కూడా ఉపయోగించి ఈ వంటకం చేయవచ్చు. ఆవాల చేపల కూర ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Fish in Mustard Curry Recipe కోసం కావలసినవి
- పులస ఫిష్ లేదా ఏవైనా కొవ్వు చేపలు- 8, అర అగుళం మందపాటి ముక్కలు
- ఆవాలు 2 టేబుల్ స్పూన్లు
- పసుపు పొడి 1/2 టీస్పూన్
- పచ్చిమిర్చి 4
- ఆవాల నూనె 4 టేబుల్ స్పూన్లు
- కారం పొడి 3/4 టీస్పూన్
- ఉప్పు రుచికి తగినంత
ఆవాల చేపల కూర తయారీ విధానం
- ముందుగా ఆవాలు, ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి కలిపి అందులో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోవాలి.
- ఆపై ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి మార్చండి, ఇందులో చేప ముక్కలను వేసి బాగా కలపాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసి కలపాలి.
- మిగిలిన నూనెను నాన్ స్టిక్ పాన్‌లో పొగ వచ్చే వరకు వేడి చేసి, తగ్గించండి, ఆపై మళ్లీ వేడి చేసి, చేప ముక్కలను వేసి 2-3 నిమిషాలు రెండు వైపులా వేయించాలి.
- ఇప్పుడు అందులో మిగిలిన 2 పచ్చిమిరపకాయలను కోసి వేయాలి, అలాగే ఎర్రని పొడికారం వేసి, ఒక కప్పు నీళ్ల పోసి బాగా కలపాలి.
- అనంతరం గిన్నెలో మిగిలిన ఆవాలు పేస్ట్‌లో 1 కప్పు నీరు కలిపి, పాన్‌లో వేయండి. చేపలు ఉడికేవరకు మూతపెట్టి ఉడికించాలి.
అంతే ఆవాల చేపలకూర రెడీ. వేడివేడి అన్నంతో తింటే అదిరిపోతుంది.
సంబంధిత కథనం