Tuna Fish Curry । ట్యూనా చేపలో పోషకాలు భేష్.. ట్యూనా చేపలకూర రుచి బెస్ట్!
Tuna Fish Curry: ట్యూనా చేపల్లో పోషకాలకు కొదువలేదు, వీటిని తినడం ఎంతో ఆరోగ్యకరం. సులభంగా తయారు చేయగల ట్యూనా ఫిష్ కర్రీ రెసిపీని ఇక్కడ చూడండి.
Recipe of the Day: ట్యూనా అనేది పెద్ద పరిమాణంలో ఉండేటువంటి ఒక ఉప్పునీటి చేప. దాని పెద్ద శరీరం ఉన్నప్పటికీ వేగంగా ఈత కొట్టగలదు. ట్యూనా చేపతో వివిధ రకాలైన వంటకాలను వండుతారు. ఈ చేపల్లో పోషకాలకు కొదువలేదు, వీటిని తినడం ఎంతో ఆరోగ్యకరం. ట్యూనాలో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మెదడు పనితీరును పెంచడానికి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైనవి. ఈ చేపలు విటమిన్ B12 కు అద్భుతమైన మూలం. ట్యూనాలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది, ఇది కొత్త ఎర్ర రక్త కణాలను రూపొందించడంలో శరీరానికి సహాయపడే ఒక పోషకం.
ట్యూనా చేపలు పెద్దగా ఉంటాయి కాబట్టి, వీటిని డబ్బాల్లో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. మీకు ట్యూనా ఫిష్ అందుబాటులో ఉంటే తప్పకుండా వండుకోండి. పులుసు పెట్టుకోండి, ఫ్రై చేసుకోండి, మీకు నచ్చినట్లుగా వండుకొని తినండి. మీరు ఇంట్లో సులభంగా తయారు చేయగల ట్యూనా ఫిష్ కర్రీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వంటకం ఎంతో రుచికరమైనది. అన్నంలో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు.
Tuna Fish Curry Recipe కోసం కావలసినవి
- 1/2 కేజీ ట్యూనా ఫిష్
- 1/2 స్పూన్ పసుపు
- 1 స్పూన్ కారం పొడి
- 2 టేబుల్ స్పూన్ల వెనిగర్
- రుచికి ఉప్పు
- నానబెట్టిన చింతపండు గోరువెచ్చని రసం
- 2 పచ్చిమిర్చి
- 1 చిన్న ఉల్లిపాయ
- మసాలా పేస్ట్ కోసం:
- 7 - 8 ఎండు మిరపకాయలు
- ½ కప్పు తురిమిన కొబ్బరి
- 2 స్పూన్ల ధనియాలు
- 1 స్పూన్ జీలకర్ర
- 6 వెల్లుల్లి రెబ్బలు
- 1 అంగుళం అల్లం
- 2 టేబుల్ స్పూన్ల నూనె
ట్యూనా చేపలకూర తయారీ విధానం
- ముందుగా ట్యూనా చేప ముక్కలను శుభ్రంగా కడిగి, ఆపైన వాటికి ఉప్పు, వెనిగర్, పసుపు, కారం పొడిని అద్ది ఒక 10 నిమిషాల పాటు మెరినేట్ చేయండి.
- ఈలోపు ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ధనియాలు, జీలక్కర్ర, వెల్లుల్లిని ఒక మిక్సర్ జార్ లో తీసుకొని పేస్టులాగా నూరుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలపవచ్చు.
- ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి, వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంతవరకు వేయించండి.
- ఆపైన సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి కలుపుతూ వేయించాలి. జార్ లో మిగిలిన మసాలాను నీళ్లతో కలిపి పోయాలి.
- ఇప్పుడు ఉప్పు, గోరువెచ్చని చింతపండు రసం కూడా వేసి, మీ అభిరుచి మేరకు నీరు పోసుకొని మూతపెట్టి మరిగించాలి.
- అనంతరం కూరలో మెరినేట్ చేసిన ట్యూనా ఫిష్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఈ దశలో కూరలో ఉప్పు సర్దుబాటు చేసుకోండి, అవసరమైతే కొద్దిగా, పచ్చి మిరపకాయలను కూడా వేసి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ట్యూనా ఫిష్ కర్రీ రెడీ. అన్నం లేదా రైస్ రోటీలతో సర్వ్ చేయండి.
చివరగా ఒక్కమాట, ఈరోజు ప్రపంచ ట్యూనా చేపల దినోత్సవం. ఇలా ఎవరికి వారు ట్యూనా చేపలను ఎలా పడితే అలా వండుకొని , ఎడా పెడా తింటున్నారు కాబట్టి.. 2030 వరకు ఈ చేపల నిల్వలను స్థిరమైన అభివృద్ధి చేయడం కోసం అవగాహన కల్పించడానికి మే 2న World Tuna Dayగా నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం