Mango Fish Curry Recipe । మామిడికాయతో చేపలకూర.. చేయండి ఇలా నోరూరించేలా!-heres delicious macha besara an odisha style unique fish curry made with tango mango check recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Fish Curry Recipe । మామిడికాయతో చేపలకూర.. చేయండి ఇలా నోరూరించేలా!

Mango Fish Curry Recipe । మామిడికాయతో చేపలకూర.. చేయండి ఇలా నోరూరించేలా!

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 01:03 PM IST

Mango Fish Curry Recipe: చేపల పులుసును మామిడి కాయ ముక్కలతో చేసుకుంటే దాని రుచే వేరు, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Mango Fish Curry Recipe
Mango Fish Curry Recipe (Slurrp)

Macha Besara: మీకు సీఫుడ్ అంటే ఇష్టమా? చేపల పులుసు అంటే చెవి కోసుకుంటారా? అయితే మీకోసమే ఈ స్పెషల్ రెసిపీ. మీరు ఇప్పటివరకు చాలా సార్లు ఫిష్ కర్రీని తిని ఉంటారు. అయితే మ్యాంగో ఫిష్ కర్రీని తిని ఉండకపోవచ్చు. మామూలుగా అయితే చేపల కూరలో చింతపండును ఉపయోగించి కూరకు పులుసు పెడతారు. అయితే మ్యాంగో ఫిష్ కర్రీలో చింతపండుకు బదులుగా ఎండు మామిడికాయను ఉపయోగిస్తారు. ఇది చేపలకూరకు ప్రత్యేకమైన పుల్లని రుచిని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో మసాలాగా ఆవాలతో చేసిన సాస్ ఉపయోగిస్తారు. ఇది కూరకు ప్రత్యేకమైన రంగు, రుచి, ఫ్లేవర్ అందిస్తుంది. ఇది ఒడిశా శైలిలో వండే చేపల కూర. ఈ వంటకాన్ని అక్కడ 'మచ్చ బీసర' అనే పేరుతో పిలుస్తారు.

మచ్చ బీసర అనేది రుచికరమైన ఒడియా వంటకాలలో ఒకటి. ఈ చేపల కూర దాని పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో కూడా ప్రసిద్ధి చెందింది. దీని అద్భుతమైన రుచికి ఎంతో మంది దాసోహం అవుతారు. మచ్చ బీసర లేదా మ్యాంగో ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈ కింద రెసిపీ (Macha Besara Recipe in Telugu) ఉంది.

Mango Fish Curry Recipe కోసం కావలసినవి

  • 700 గ్రా రోహు చేప ముక్కలు
  • 2 టేబుల్ స్పూన్ ఆవాలు
  • 1 ఎండు మామిడి ముక్క
  • 1 టమోటా
  • 2-3 వెల్లుల్లి
  • 1 ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • 2 స్పూన్ పసుపు పొడి
  • 1 టీస్పూన్ కారం
  • 1 టీస్పూన్ ధనియాల పొడి
  • 1 టీస్పూన్ జీలకర్ర పొడి
  • 1 టీస్పూన్ పంచ్ ఫోరాన్
  • 4-5 కరివేపాకు ఆకులు
  • 2 ఎండు మిర్చి
  • 4 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
  • 1 స్పూన్ చక్కెర (ఐచ్ఛికం)
  • ఉప్పు రుచికి తగినంత
  • కొత్తిమీర గార్నిషింగ్ కోసం

మ్యాంగో ఫిష్ కర్రీ తయారీ విధానం

  1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పసుపు, కారం, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, 1 టీస్పూన్‌ ఆవాల నూనెతో కలిపిన మిశ్రమంతో 10 నిమిషాలు మెరినేట్ చేయండి.
  2. ఈ లోపు పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటో ముక్కలతో పాటు ఆవాలు కూడా వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని, పక్కన పెట్టుకోండి.
  3. ఆ తర్వాత బాణలిలో మిగిలిన నూనెను వేడి చేసి, మెరినేట్ చేసిన చేప ముక్కలను రెండు వైపులా లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఆపైన ఈ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు అదే నూనెలో పంచ్ ఫోరాన్, ఎండు మిరపకాయలు, బిరియానీ ఆకులు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి, ఆపైన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
  5. ఇప్పుడు అదే నూనెలో రుబ్బిన పేస్ట్, కారం, జీలకర్ర పొడి, పసుపు వేసి కలపాలి, నూనె బయటకు వచ్చేవరకు వేయించాలి.
  6. అనంతరం అందుల్ఫో 2 కప్పుల నీరు వేసి మరిగించాలి, ఇందులో మామిడి ముక్కను వేసి పులుసు చిక్కగా మారేంత వరకు ఉడికించాలి.
  7. చివరగా వేయించిన చేపలను వేసి సుమారు 2-3 నిమిషాలు ఉడకబెట్టండి, పైనుంచి కొత్తిమీర చల్లండి. స్టవ్ ఆఫ్ చేయండి.

అంతే, ఘుమఘుమలాడే మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ. ఈ చేపల కూరను అన్నంలో కలుపుకొని తింటే ఆహా అంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం