Monday Motivation । సమస్య మీదైతే.. దానికి సమాధానం మీ దగ్గరే ఉంటుంది!
Monday Motivation: తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఆదివారం పోయి మళ్లీ సోమవారం వచ్చింది, కానీ జీవితంలో సమస్యలు పోయి సంతోషాలు రావడం లేదని బాధపడుతున్నారా? ఈ కథ చదవండి, సమస్యలకు మీరే ఒక సమస్యగా నిలవండి.
Monday Motivation: జీవితంలో సమస్యలు అందరికీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉన్నంత మాత్రాన వారికి సమస్యలు లేవని కాదు. కొంతమంది సమస్యలను కూడా చిరునవ్వుతో స్వీకరిస్తారు, ఏదైతే అదవుతుందిలే అనుకుంటూ ముందుకు సాగుతారు. మరికొంత మంది తమకున్న సమస్యలు అందరికీ చెప్పుకుంటారు, వాటి గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. తమ బ్రతుకును తమ కోసం కాకుండా, ఎవరికోసమో బ్రతుకుతున్నట్లుగా భారంగా ఒక్కోరోజును వెల్లదీస్తారు. కానీ అలా బాధపడితూ కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం కాదు అనేది వాస్తవం.
ఎప్పుడైనా మనం సమస్యను ఎలా చూస్తున్నాం అనే దానిపైనే మనం జీవితం ఆధారపడి ఉంటుంది. సమస్యల గురించి ఆలోచిస్తున్నంత సేపు అది బాధనే కలిగిస్తుంది, మీరు మోయలేని భారమే అనిపిస్తుంది. ఒక్కసారి అన్నీ మరిచిపోయి, ప్రస్తుతంలో జీవించండి. మీ జీవితానికి సంతోషం అక్కడే లభిస్తుంది. ఇది చెప్పినంతా సులభం కాకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా సంతోషంగా ఉండటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో సంతోషాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు బాధలను కాకుండా మీరు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి, అందరితో కలిసి ఏదైనా విందులో పాల్గొనాలి, నిన్నటి కంటే ఈరోజు ఇంకా సంతోషంగా ఉండాలి అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలనుకుంటే అది చేసేయండి.
ఇక్కడొక చిన్న సంఘటన చెప్పుకుందాం.. ఒకరోజు ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఒక అరగ్లాసు నీళ్లతో తరగతి గదిలోకి ప్రవేశిస్తాడు. విద్యార్థులను చూస్తూ " ఈ గ్లాసు సగం ఖాళీగా ఉందా లేదా సగం నిండిం ఉందా?" అని ప్రశ్నిస్తాడు. అందుకు విద్యార్థులు కొందరు సగం నిండి ఉందని, సగం ఖాళీగా ఉందని చెప్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ మళ్లీ అడుగుతూ.. నా చేతిలోని గ్లాసు ఎంత బరువు ఉండవచ్చు అని అడుగుతాడు. అప్పుడు కొంతమంది 10 గ్రాములు, ఇంకొంత మంది 20 గ్రాములు అంటూ వివిధ రకాలుగా సమాధానాలు చెబుతారు.
అయితే దీని బరువును మోయడం మీకు తేలికే కదా, ఎవరెవరు ఎంత సేపు మోస్తారో చూద్దాం అని ఒక్కొక్కరిని పిలుస్తారు. అలా ఒక్కో విద్యార్థి వచ్చి ఆ గ్లాసును కొద్దిసేపు మోసి పక్కనపెడతారు. ఎందుకు పక్కన పెట్టారు అని ప్రొఫెసర్ అడగగా, చెయ్యి నొప్పి పెట్టింది అని విద్యార్థులు బదులిస్తారు.
అప్పుడు ప్రొఫెసర్ మాట్లాడుతూ.. మీకు జీవితంలో వచ్చే ఇబ్బందులు, మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా ఇంతే. కొద్దిసేపు వాటిని పట్టుకున్నప్పుడు తేలిక అనిపిస్తుంది, ఎక్కువ సమయం పాటు మోస్తే తేలికైనది కూడా మోయలేనంత బరువుగా మారుతుంది.
మీరు రోజూవారీగా ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, అది మీపై అంత ఒత్తిడిని పెంచుతూపోతుంది. ఆలోచించండి, కానీ ఎక్కువగా ఆలోచిస్తేనే సమస్య. కాబట్టి మీ సమస్యలపై దృష్టిపెట్టకుండా, మీ లక్ష్యాలపై దృష్టిపెట్టాలి అని ప్రొఫెసర్ చెబుతారు.
ఈ చిన్న కథతో మీకు విషయం అర్థం అయినట్లే కదా? జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ కూర్చోకుండా, జరగాల్సిన పనులపై దృష్టిపెట్టాలి. మీ లక్ష్యం ఏమిటో ఆ దిశగా కదలికలు ఉండాలి. మీ సమస్యలను కాసేపు గాలికొదిలేయండి, అవే గాలిలో కలిసిపోతాయి. ఎందుకంటే సమస్య నీదైనప్పుడు ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి. కానీ దానికి అసలైన సమాధానం నీ దగ్గరే ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్