Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం-here are tips to remove the invisible pesticides on fruits that pose a cancer risk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Haritha Chappa HT Telugu
May 03, 2024 12:30 PM IST

Washing Fruits: ఇప్పుడు అన్ని కూరగాయలను, పండ్లను పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని తినే ముందు క్రిమిసంహారక మందులను తొలగించాలి. అందుకోసం ఇంట్లోనే ఇలా చేయండి.

పండ్లను ఎలా శుభ్రపరచాలి?
పండ్లను ఎలా శుభ్రపరచాలి? (pixabay)

Washing Fruits: పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. సమతుల్య ఆహారం కోసం వీటిని కూడా తింటూ ఉండాలి. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, మామిడిపండ్లు, జామకాయలు.. ఇలా అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అయితే వీటన్నింటిని క్రిమిసంహారక మందుల ద్వారా పండించడం అధికమైంది కాబట్టి రసాయనాలు నిండిన పండ్లను అలాగే తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లోనే ఈ పండ్లను జాగ్రత్తగా పరిశుభ్రంగా మార్చుకోవాలి. ఆ తర్వాతే వాటిని తినాలి. పండ్లపై ఉన్న రసాయనాలను ఎలా తొలగించాలో ఇక్కడ మేము చెప్పాము.

పండ్లు కొన్నాక వాటిపై ఉండే పురుగుల మందులను, రసాయనాలను తొలగించడానికి సులువైన మార్గం నీటిలో నానబెట్టడం. పండ్లు మునిగే వరకు నీటిలో వేసి నానబెట్టాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత చేత్తోనే వాటిపై రుద్ది కడగాలి. కొళాయి కింద నీటిని వదిలి పండ్లను ఒక్కొక్క దాన్ని చేత్తోనే రుద్ది కడుగుతూ ఉంటే పైన ఉన్న పెస్టిసైడ్స్ పోయే అవకాశం ఉంది.

ఉప్పు వేసిన నీళ్లలో

ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత ఆ పండ్లను చేతితోనే శుభ్రంగా రుద్ది మరొకసారి కొళాయి కింద పెట్టి నీటిలో కడగండి. ఇలా చేస్తే పైనున్న పెస్టిసైడ్స్ త్వరగా పోతాయి.

పీలింగ్

పండ్ల పై ఉన్న తొక్క పైనే క్రిమిసంహారకాలు, రసాయనాలు పేరుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత పై తొక్కను తీసి తినేందుకు ప్రయత్నించండి.

స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు వేసి మరిగించండి. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతకు మరిగిస్తే పండ్లు పాడైపోతాయి. కాస్త గోరువెచ్చగా అయినప్పుడు పండ్లను ఆ నీటిలో ఒక నిమిషం పాటు నానబెట్టండి. ఆ తర్వాత వెంటనే తీసి చల్లని నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంది.

వెనిగర్

నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఆ నీటిలో పండ్లను వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత వాటిని తీసి కొళాయి కింద పెట్టి చేత్తో రుద్ది కడగండి. ఆ పండ్లను టవల్ తో తుడిచి త్వరగా పొడిగా అయ్యేలా చేయండి. ఇలా చేస్తే పురుగుల మందులు పోయే అవకాశం ఉంది.

ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉండడం సర్వసాధారణం. నీటిలో ఈ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి పండ్లను వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లను తీసి కుళాయి కింద ఉన్న నీటిలో రుద్ది కడగాలి. ఇలా చేస్తే పంటలపై ఉన్న రసాయనాలు చాలా వరకు పోతాయి. కొన్ని రకాల కూరగాయలను ఇలా శుభ్రం చేయడం ద్వారా పెస్టిసైడ్స్ ఫ్రీ ఆహారాలను తినే అవకాశం ఉంది.

Whats_app_banner