Homemade Probiotic Drinks । మీ కడుపును చల్లబరిచి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పానీయాలు
Homemade Probiotic Drinks: మీరు తినే ఆహారంలో ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవడం వల్ల అది శరీరంలోని వ్యాధికారక క్రిములని నిర్మూలించడానికి , పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేసే 3 అద్భుతమైన పానీయాలు ఇక్కడ తెలుసుకోండి.
మెల్లిమెల్లిగా వాతావరణం శీతాకాలం నుంచి వేసవికి రూపాంతరం చెందుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ శీతల పవనాలు పోయి, వేడి గాలులు రావడం ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ రెండింటికి నడుమ వసంతకాలం అనే వారధి ఉంది. అయితే ఇలా సీజన్ మారేటపుడు జీర్ణ సమస్యలు తలెత్తడం సాధారణం. గుండెల్లో గ్యాస్ట్రిక్ మంట అనేది వసంతకాలంలో ఎదురయ్యే ఒక సాధారణ జీర్ణ సమస్య. ఈ సీజన్‌లో పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అలర్జీలు కూడా తలెత్తవచ్చునని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మన పేగు మైక్రోబయోమ్‌లో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్‌లతో సహా ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో చాలా వరకు స్నేహపూర్వకమైనవే ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల మధ్య పరస్పర చర్య సాఫీగా, సానుకూలంగా ఉంటుంది, అయితే ఏదైనా సీజనల్ అలెర్జీ తలెత్తిన సందర్భంలో పేగు మైక్రోబయోమ్‌లో సమతుల్యత చెదిరిపోతుంది. అది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అయితే ఆహారంలో ప్రోబయోటిక్స్‌ని చేర్చడం వల్ల పేగులో వ్యాధికారక కణాల పెరుగుదలను పరిమితం చేయడంలో సహాయపడవచ్చు. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే పేగులో మైక్రోబయోమ్ సమతుల్యమైన కూర్పును కూడా పునరుద్ధరించగలవు, పేగు వాపును నిరోధించగలవు.
Homemade Probiotic Drinks- ప్రోబయోటిక్స్ పానీయాలు
ప్రోబయోటిక్స్‌ని మీకు మీరుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పేగు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని అద్భుతమైన ప్రోబయోటిక్స్ పానీయాలను ఇక్కడ తెలుసుకోండి.
1. బీట్‌రూట్ గంజి
బీట్‌రూట్ గంజీ అనేది ఇంట్లో తయారుచేయగల ఒక మంచి ప్రోబయోటిక్ పానీయం. దీనిని తయారు చేయడం చాలా సులభం, అంతేకాదు ఈ పానీయం తాగడం వలన పేగు ఆరోగ్యం మెరుగుపడటమే కాక, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ గంజి తయారు చేయడానికి మీకు క్యారెట్, బీట్‌రూట్, నీరు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఉప్పు అవసరం అవుతాయి. వీటన్నింటిని కలిపి బ్లెండర్లో జ్యూస్ లాగా చేయాలి, ఆపై ఒక గిన్నెలో పులియబెట్టాలి. ఇలా తయారు చేసిన గంజిని 1 నెల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. భోజనం చేసేటపుడు లేదా రాత్రి భోజనానికి ముందు ఈ గంజిని 100 మి.లీ తాగాలి. ఈ ప్రోబయోటిక్ పానీయం జీర్ణక్రియకు సహాయపడుతుంది, గుండెల్లో మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
2. అన్నం గంజి
బెంజ్ తెలియకపోయినా అన్నం గంజి చాలా మందికి తెలిసిన ఒక ఆహార పదార్థం. అయితే వండిన అన్నాన్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసిన గంజిని తాగటం పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అన్నంలో ఎక్కువ నీరు కలిపి రాత్రంతా ఉంచుతారు. మరుసటి రోజు దానిని మెత్తని పేస్ట్ లాగా చేయాలి, ఆపై పెరుగును కలపడం ద్వారా రుచిని కలిగించవచ్చు. ఈ రకం అన్నం గంజి అజీర్ణం, మలబద్ధకం లేదా IBS వంటి గట్ సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
3. మజ్జిగ
మజ్జిగ మనందరికీ తెలిసిందే. చాలా మంది ఎవరికి వారే ఇంట్లో పెరుగును తోడుపెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. తయారైన పెరుగులో నీళ్లు పోయి చిలికితే మజ్జిగ తయారవుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. ఈ పానీయంలో పేగును కాపాడే లాక్టోబాసిల్లి బ్యాక్టీరియా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, పెరుగును నేరుగా తీసుకోవడం వలన సూక్ష్మజీవులు భారీ వృద్ధి చెంది పేగులో అసమతుల్యతకు కారణం కాగలదు, పెరుగు స్థానంలో మజ్జిగ తీసుకోవడం వలన ఇది చాలా ఆరోగ్యకరమైనది.
పోషకాహార నిపుణుల ప్రకారం 1 గిన్నె పెరుగు అంటే 150 గ్రాముల పెరుగు లేదా మజ్జిగ రోజులో 2 గ్లాసుల చొప్పున తీసుకోవాలి.