Heart-Healthy Lifestyle । మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ జీవనశైలి ఇలా ఉండాలి!
Heart-Healthy Lifestyle: చురుకైన జీవనశైలి, కొన్ని ఆహార మార్పులతో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు. మీ ఆచరణ ఎలా ఉండాలో ఈ కింద తెలుసుకోండి.
Heart-Healthy Lifestyle: హృదయ సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధానంగా మనం అనుసరించే జీవనశైలి కారణం అవుతుంది. అతిగా ధూమపానం చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతరమైన ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం మొదలైనవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆంజినా అనేది గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి. ఈ స్థితిలో గుండె పిండేసినట్లుగా అనిపించడం, భారంగా బిగుతుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది మీరు కొన్ని కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు తరచుగా సంభవిస్తుంది.
ఆంజినా, గుండెపోటు ఈ రెండూ కూడా కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) కారణంగా తలెత్తేవే, అయితే ఆంజినా అనేది కాస్త తక్కువ తీవ్రత కలిగిన పరిస్థితి. మనలో చాలా మంది ఆంజినా, గుండె సమస్యలతో పోరాడుతున్నారు. మీకు అధిక రక్తపోటు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే మీరు మరింత జాగ్రత్తపడాలి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు. చురుకైన జీవనశైలి, కొన్ని ఆహార మార్పులతో ఆంజినాను ఎదుర్కోవచ్చు.
గుండెను ఆరోగ్యంగా చూసుకోవటానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రించడానికి మీ ఆచరణ ఎలా ఉండాలో ఈ కింద తెలుసుకోండి.
ధూమపానం, మద్యపానం వదిలేయండి
ధూమపానం అసలే చేయవద్దు, పొగాకు ఉత్పత్తులను పూర్తిగా వదిలివేయాలి. మీకు మద్యపానం అలవాటు ఉండి మద్యం మానేయలేకపొతే పరిమితి విధించుకోండి. పురుషులైతే 2 పెగ్గులకు మించి తీసుకోకూడదు, స్త్రీలకు 1 పెగ్ మించరాదు. మానేస్తే మరింత ఆరోగ్యకరం.
భావోద్వేగ ఆరోగ్యం
అనవసరంగా ఒత్తిడికి లోనవకండి. ఆందోళన, డిప్రెషన్ భావాలను తగ్గించుకోండి. అతిగా ఆలోచించడం మానేయండి. భావోద్వేగ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయండి.
వ్యాయామం చేయండి
వాకింగ్, స్విమ్మింగ్ లేదా సైకిల్ తొక్కడం వంటి ఏరోబిక్ వ్యాయామాలను చేయండి, రోజుకు కనీసం 40 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాల లక్ష్యంతో వ్యాయామం చేయండి. వారానికి కనీసం 3 నుండి 4 రోజులు వ్యాయామం తప్పనిసరి.
అధిక బరువుని నియంత్రించండి
ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండండి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 18.5 నుండి 24.9 వరకు అలాగే నడుము సైజ్ 35 అంగుళాలు (90 సెంటీమీటర్లు) కంటే తక్కువగా ఉంచుకునేలా ప్రయత్నించండి.
ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి?
మీ గుండె ఆరోగ్యానికి మంచి పోషకాహారం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు CHDకి సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలను నియంత్రించడంలో మీకు సహాయపడతాయి.
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు పుష్కలంగా తినండి.
- కొవ్వులేని చికెన్, చేపలు, బీన్స్ వంటి ప్రోటీన్లను ఎంచుకోండి.
- కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తినండి.
- అధిక స్థాయిలో సోడియం (ఉప్పు) ఉన్న ఆహారాన్ని నివారించండి.
- వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు కలిగిన ఆహారాలను నివారించండి.
- జున్ను, క్రీమ్ లేదా గుడ్లు తక్కువ తినండి.
మీరు తినే ఆహారం, మీరు చేసే శారీరక శ్రమ, మీరు తగ్గించే మానసిక ఒత్తిళ్లలతో మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్