Vegetable pasta: హెల్దీ వెజిటేబుల్ రెడ్ సాస్ పాస్తా.. రుచికరమైన అల్పాహారం..
Vegetable pasta: బోలెడు కూరగాయలు వేసుకుని ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
వెజిటేబుల్ రెడ్ సాస్ పాస్తా (freepik)
పాస్తా ఇష్టపడని పిల్లలుండరు. కానీ ఎక్కువగా బయట స్టోర్లలో అమ్మే ఇన్స్టంట్ పాస్తాకు బదులు ఇంట్లోనే పాస్తా చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధమవుతుంది. పిల్లలతో పాటూ మీరు కూడా ఇష్టంగా తినేస్తారు. తయారీ కూడా చాలా సులభం.
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల పాస్తా
సగం చెంచా ఉప్పు
3 చెంచాల వంట నూనె
1 చెంచా బటర్
సగం టీస్పూన్ జీలకర్ర
1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు
2 పచ్చిమిర్చి తరుగు
పావు కప్పు టమాటా ముక్కలు
1 చెంచా కారం
సగం చెంచా ధనియాల పొడి
సగం చెంచా పసుపు
పావు చెంచా గరం మసాలా
సగం కప్పు క్యారట్ ముక్కలు
సగం కప్పు ఉడికించిన మొక్కజొన్న గింజలు
సగం కప్పు క్యాప్సికం ముక్కలు
2 చెంచాల టమాటా సాస్
సగం కప్పు చీజ్ తురుము
తయారీ విధానం:
- ముందుగా ఒక మందపాటి అడుగున్న గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, కాస్త ఉప్పు, 1 చెంచా నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నపుడు పాస్తా వేసుకోవాలి.
- పాస్త ఉడికాక నీళ్ల నుంచి వడగట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని వేడెక్కాక బటర్, నూనె వేసుకోవాలి. వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకునే వేగనివ్వాలి.
- ఇప్పుడు టమటా ముక్కలు వేసి బాగా కలుపుకుని టమాటా ఉడికి మెత్తబడ్డాక జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసుకోవాలి.
- ఇపుడు మొక్కజొన్న గింజలు, క్యారట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉడికాక సగం కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలి. రెండు మూడు నిమిషాలయ్యాక టమాటా సాస్, చీజ్ తురుము కూడా వేసుకోవాలి.
- చీజ్ కరిగాక ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకుని కలుపుకోవాలి. రెండు నిమిషాలు బాగా కలుపుకుని స్టవ్ కట్టేయాలి. అంతే మసాలా పాస్తా సిద్ధం.