Happy Ugadi 2023 । శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఇలా తెలియజేయండి!
Happy Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ ఆత్మీయులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలపండి, ఈ పర్వదినం మరొక గొప్ప ఆరంభం కావాలని ఆకాంక్షించండి.
Happy Ugadi 2023: హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. ఇది తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగ. అందుకే ఈ ఉగాది పర్వదినాన జీవిత సారాన్ని తెలిపే ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ అన్ని రుచులను అనుభవిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఉగాది పండుగ సూచిస్తుంది.
హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించి, కాలాన్ని సృష్టించిన రోజు అని నమ్ముతారు. యుగానికి ఆరంభం జరిగింది కావునే ఇది యుగాది అయింది. చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది యుగమునకు ఆది ఉగాదిగా హిందూ పురాణాలు తెలియచేసాయి.
ఉగాదిని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో పిలుస్తారు. తెలుగు ప్రజలకు ఉగాది, కన్నడిగులకు యుగాది, ఉత్తర భారతదేశంలో దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు - చైత్ర నవరాత్రి, మహారాష్ట్రలో గుడి పడ్వా, అలాగే తమిళులు పుత్తాండు పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
తెలుగు సంవత్సరాది మొదటి రోజున కొత్త పనులు ఆరంభించడం, విద్యార్థులు కొత్త పాఠాలను ప్రారంభించడం, కళాకారులు కొత్త కళను ప్రారంభించడం, గృహస్తులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుక్కోవడం వంటివి ఉగాది రోజున చేయడం శుభప్రదం. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంగా జరుపుకోండి. ఇక నుంచి అంతా శోభకృత నామ సంవత్సరం, శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. ఈ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగును నింపేది అని చెప్పడమైనది. నిజంగానే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Ugadi- శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శోభకృత నామ సంవత్సరం అంతా మీకు శోభాయమానంగా ఉండాలి.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తీసుకురావాలని ఆశిస్తూ .. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఉగాది మీకు అద్భుతమైన ఆరోగ్యం, జీవితంలో సిరిసంపదలు, సుఖసంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ... శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను తుడిచెద్దాం.. షడ్రుచులతో మధురమైన జీవితం నూతనంగా ప్రారంభిద్ధాం.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
మామిడి పువ్వు పూతకొచ్చెనె.. కోయిల గొంతుకు కొత్త కూత వచ్చెనె
వేప కొమ్మకు పువ్వులు పూసెనె.. కొత్త బెల్లం పసిడి వెలుగులు తెచ్చెనె
ఉగాది పండుగ రానే వచ్చెనె.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
సంబంధిత కథనం