Ugadi 2023 । శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది ప్రత్యేకత, ఆచరించవలసిన ధర్మాలు!
Ugadi 2023: శ్రీ శోభకృత నామ సంవత్సరంలో మార్చి 22, 2023న బుధవారం రోజు ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉగాది ప్రత్యేకత ఏమిటి, శోభకృత నామ సంవత్సరంలో ఆచరించవలసిన ధర్మములు, మొదలగు అన్ని విషయాలను ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Ugadi 2023: ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే 'కొత్త యుగం ప్రారంభం' అని దీని అర్థం. హిందూ పంచాంగ ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫాల్గుణ మాసం, శుభకృత నామ సంవత్సరం మార్చి 21న ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 22 నుంచి చైత్ర మాసం ప్రారంభం అవుతుంది. చైత్ర మాసం ప్రారంభమయ్యే మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఆరోజు నుంచే 'శోభకృతు నామ సంవత్సరం' ప్రారంభం అవుతుంది. శోభకృత నామ సంవత్సరంలో మార్చి 22న బుధవారం రోజు ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఉగాది ప్రత్యేకతను తెలియజేశారు. శోభకృతు నామ సంవత్సరంలో చేయవలసిన కార్యములను వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉగాది ప్రత్యేకత ఏమిటి?
యుగ అంటే నక్షత్ర గమనము. యుగ అంటే జన్మ.యుగ అంటే ఆయుష్షు అని అర్థములు కలవు. నక్షత్ర గమనానికి, నక్షత్ర జననానికి ఆది కాబట్టి (ఆది అనగా ప్రారంభము) ఇది యుగాది అయినది. యుగస్య ఆది అనేది ఉగాది. ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఇది యుగాది అయినది అని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
యుగము అంటే 2 లేదా జంట అని. ఉత్తరాయణము, దక్షిణాయణము కలిపి ఒక యుగము (సంవత్సరము). పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించి సముద్ర గర్భంలో దాగియుండగా మత్స్యవతారమైనటువంటి విష్ణువు సోమకుడిని వధించి బ్రహ్మకు వేదాలను తిరిగి అప్పగించి ఈ సృష్టిని బ్రహ్మ తిరిగి ప్రారంభించిన రోజుగా ఉగాదిగా అలా సోమకుని సంహరించి సృష్టి ప్రారంభమైన రోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది యుగమునకు ఆది ఉగాదిగా మన పురాణములు తెలియచేసాయి.
శాలివాహన చక్రవర్తి ఈ రోజే పట్టాభిషిక్తుడైనట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. దానికి చిహ్నంగా శాలివాహక శకంగా జరుపుతారని అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శోభకృత్ అంటే ఏమిటి? ఈ సంవత్సరము ఏమి చేయాలి?
మనకు కాలగమనములో 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలుగా ఉన్నాయి. 22 మార్చి 2023 బుధవారం చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. అనగా శోభకృత్ సంవత్సరము జీవితాలలో వెలుగును నింపేది అని ఉద్యానవనాలన్నీ పూలశోభతో కళకళలాడుతూ ఉండేటటువంటి సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము. ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా సూర్యోదయానికి పూర్వం లేచి ఇంటికి శుభ్రపరచుకొని మామిడి తోరణాలతో, పూలతో ఇంటిని ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి. ఉగాది రోజు కచ్చితంగా తలస్నానమాచరించాలి. ఉగాదిరోజు కొత్త బట్టలు ధరించాలి. ఉగాది రోజు ఇంటి ఇలవేల్పును లేదా ఇంటిలో పూజించేటటువంటి మీ ఇష్టమైన దైవారాధన చేయాలి. ఉగాది రోజు ఆలయ దర్శనం వంటివి చేయడం చాలా విశేషము. ఉగాది రోజు దైవారాధన పూజలు అయిన తరువాత ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ఇంటిల్లపాది స్వీకరించాలి. బంధుమిత్రులకు పంచాలి. ఉగాది రోజు తల్లిదండ్రులు, గురువులు ఆశీస్సులు పొందాలి. ఉగాది రోజు కచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలి అని మన సనాతన ధర్మం తెలియచేస్తుంది.
కొత్త పనులు ఆరంభించడం అనగా విద్యార్థులు కొత్త పాఠాలను ప్రారంభించడం, కళాకారులు కొత్త కళను ప్రారంభించడం, గృహస్తులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుక్కోవడం ఇవి అన్నీ ఉగాది రోజున చేయడం శుభప్రదం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, రామాయణ, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలు చదవడం, నూతన పనులు ప్రారంభించడం, పెద్దల ఆశీస్సులు పొందడం వంటివి ఆచరించాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం