Sanatana Dharmam । సనాతన ధర్మంలో భగవతారాధనలు మూడు రకాలు, అవేమిటంటే?!
Sanatana Dharmam: సనాతన ధర్మం ప్రకారం, భగవతారాధనలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. అయితే ఈ ఆరాధనలలో మూడు ముఖ్యమైన ఆరాధనలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
Sanatana Dharmam: మన సనాతన ధర్మంలో సృష్టికర్త బ్రహ్మగా, సృష్టిని నడిపించేది విష్ణువుగా, అలాగే లయకారకుడు ఈశ్వరుడు అయినటువంటి శివుడు ఉన్నట్లుగా సనాతన ధర్మం తెలుపుతుంది. ఈ ముగ్గురిని శక్తిస్వరూపిణి అయినటువంటి అమ్మవారు నడిపిస్తున్నట్లుగా పురాణాలు తెలియచేసాయి. అందుకనే మన సనాతన ధర్మంలో శివారాధన, విష్ణురాధన, శక్తి ఆరాధనకు చాలా ప్రాధాన్యత ఏర్పడినదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
స్కంధ పురాణము, లింగ పురాణము ప్రకారం శివుని శాపము వలన బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కడా గుడి కానీ, పూజలు కానీ ఉండవు. అయితే యజ్ఞయాగాదులలో గురుస్థానము లభించినది. మరోవైపు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు. ఈ ప్రకారంగా, మన సనాతన ధర్మంలో మూడు రకాలైనటువంటి ఆరాధనలున్నాయి, అవి..
1. శివారాధన
2. విష్ణురాధన
3. శక్తి ఆరాధన
నారాయణుని స్వరూపంలో మహా విష్ణువును పూజించడం ఒక రకమైన ఆరాధన అయితే.. శక్తి రూపంలో దుర్గా సరస్వతి లక్ష్మీదేవులను ఆరాధించడం మరొకటి. అలాగే లింగరూపములో శివారాధన చేయడం ఈరకంగా మూడు రకాలైనటువంటి ఆరాధనలున్నాయి.
పుణ్యక్షేత్రాలు - విశేషాలు
మహావిష్ణువుకు సంబంధించి 108 దివ్యక్షేత్రాలు, 4 ధామాలు అనగా బదరీనాథ్, రామేశ్వరం, ద్వారక మరియు పూరీ జగన్నాథ్ వంటివి ఉన్నవి. శక్తిస్వరూపిణి అయినటువంటి అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాలున్నాయి. శివారాధన చేసేటటువంటి వారికి ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా ప్రత్యేకమైనవి. అమ్మవారివి 108 శక్తిపీఠాలు అఖండ భారతములో ఉన్నట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఆ 108లో శంకరాచార్యులవారు 18 పీఠాలను విశేషంగా స్థాపించటం వలన ఈ శక్తిపీఠాలకు, అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకత ఏర్పడినది. సనాతన ధర్మంలో 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు, అలాగే 4 వైష్ణవ ధామాలకు ప్రత్యేకత ఉన్నది.
భగవతారాధన విష్ణు, శివ, శక్తిస్వరూపాలలో ఆరాధించడం సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకం. వీటితోపాటు విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, శక్తి ఆరాధన (లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఆరాధనలు) అలాగే శ్రీమన్నారాయణుని రకరకాల అవతారాలు ఆరాధన, దత్తాత్రేయుని ఆరాధన సనాతన ధర్మంలో ఇవి ప్రత్యేకమైనవని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం
టాపిక్