Hyderabad Formula E race Case : ఫార్ములా ఈరేస్ కేసు ఏంటి..? కేటీఆర్ పై విచారణ అందుకేనా..?
Hyderabad Formula E race Case :ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ విచారణకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుండగా… అదే స్థాయిలో అధికార పార్టీ వైపు నుంచి రీసౌండ్ వస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరుపుతామని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈరేసు కూడా ఒకటిగా ఉంది.
ఈ కేసు విచారణ ఏసీబీ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ కేసులో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించాలని దర్యాప్తు సంస్థ యోచిస్తోంది. ఈక్రమంలోనే కేటీఆర్ విచారణకు కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. అనుమతి కోసం కొద్దిరోజులుగా వేచిస్తుండగా… తాజాగా రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏసీబీ విచారణ స్పీడప్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
నోటీసులా..? అరెస్టా…?
ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ పేరు తెరపైకి వస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 50 కోట్లపైకు పైగా నిధుల చెల్లింపులు జరిగాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక మంత్రులు కూడా కొద్దిరోజులుగా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
కొద్దిరోజులు కిందటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. పలు అంశాలపై చర్చించగా… ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై న్యాయసలహా తీసుకున్న రాజ్ భవన్ కార్యాలయం.. తాజాగా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో… ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో కేటీఆర్ ను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దర్యాప్తు సంస్థ ముందుగా… నోటీసులు ఇస్తుందా..? లేక అదుపులోకి తీసుకుంటుందా…? అనేది ఉత్కంఠను రేపుతోంది.
ఫార్ములా ఈరేసింగ్ కేసు ఏంటి..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూాడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించాలని గుర్తుంచింది. విదేశీసంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసును ఏసీబీకి చేతికి అప్పగించింది.
ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు. ఈ-రేస్‌కు కోసం ప్రభుత్వం తరపున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే అని… కానీ హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు.
ఈ-రేస్‌ను ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో అరవింద్ కుమార్ తప్పు ఏం లేదని… నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చని… దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదన్నారకు. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు అన్న కేటీఆర్… ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశామన్నారు. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ కామెంట్స్ కూడా చేశారు.