Michael Schumacher: 11 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన ఫార్ములా వన్ ఛాంపియన్.. కూతురు పెళ్లిలో ఇలా..
Michael Schumacher: ఫార్ములా వన్ లెజెండ్ మైఖేల్ షుమాకర్ 11 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 2013లో ప్రమాదానికి గురైన తర్వాత ఇంటికే పరిమితమైన అతడు.. తాజాగా తన కూతురి పెళ్లిలో కనిపించినట్లు ఓ రిపోర్టు వెల్లడించింది.
Michael Schumacher: మైఖేల్ షుమాకర్.. ఫార్ములా వన్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడు. ఏకంగా ఏడుసార్లు వరల్డ్ ఛాంపియన్. అలాంటి రేసర్.. 11 ఏళ్ల కిందట స్కీయింగ్ చేస్తూ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచే ఇంటికే పరిమితమైన అతడు.. ఈ మధ్యే తన కూతురు పెళ్లికి హాజరైనట్లు యురోపియన్ మీడియా వెల్లడించింది.
మైఖేల్ షుమాకర్ ఇంటి నుంచి బయటకు..
మైఖేల్ షుమాకర్ కూతురి పెళ్లి ఈ మధ్యే స్పెయిన్ లోని మలోర్కాలో జరిగింది. ఈ పెళ్లికి అతడు హాజరయ్యాడని, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఆ సమయంలో అక్కడ ఉన్నారని యురోపియన్ మీడియా చెబుతోంది. 2013లో ప్రమాదానికి గురైన తర్వాత ఇప్పటి వరకూ అతడు బయటకు రాలేదు.
ఈ మధ్యే తన కూతురు గినా మారియా పెళ్లి జరగగా.. తన ఫ్యామిలీ విల్లాలో కొత్తగా పెళ్లయిన జంటను ఆశీర్వదించడానికి షుమాకర్ బయటకు వచ్చినట్లు జర్మనీకి చెందిన బిల్డ్ న్యూస్ పేపర్ తెలిపింది. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ ఎస్టేట్ కు చెందిన గార్డెన్ లో జరిగిన వేడుకలకు మాత్రం అతడు రాలేదని తెలిపింది.
పెళ్లి సమయంలో షుమాకర్ బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్న సన్నిహితులు, ఇతర అతిథుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సదరు రిపోర్టు చెప్పింది. షుమాకర్ కు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వార్తలు మీడియాలో రాకుండా అతని కుటుంబం 11 ఏళ్లుగా జాగ్రత్తపడుతోంది. ఇక ఇప్పుడు తన తనయుడు మిక్ షుమాకర్ పెళ్లి ఈవెంట్ కు కూడా మైఖేల్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిక్ ఎఫ్ఐఏ ఎండ్యూరెన్స్ ఛాంపియన్షిప్ లో ఆల్పైన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
మైఖేల్ షుమాకర్ కు అసలు ఏం జరిగింది?
మైఖేల్ షుమాకర్ 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. అతడు ప్రాణాలతో బయటపడినా.. అసలు నడవలేని, ఎవరినీ గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. 11 ఏళ్లుగా అతనికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వార్తలు బయటకు రాకుండా కుటుంబం చూసుకుంటోంది.
మైఖేల్ షమాకర్ ఫార్ములా వన్ ఆల్ టైమ్ గ్రేట్ రేసర్లలో ఒకడు. 1994 నుంచి 2004 వరకు అతడు ఏడుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 2020లో లూయిస్ హామిల్టన్ అతని రికార్డును సమం చేశాడు. షుమాకర్ రిటైర్మెంట్ సమయానికి అత్యధిక విజయాలు (91), అత్యధిక పోల్ పొజిషన్స్ (68), అత్యధిక పోడియం ఫినిషెస్ (155) లాంటి రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతటి గ్రేట్ ఫార్ములా వన్ రేసర్ దశాబ్దకాలంగా ఇంట్లో మంచానికే పరిమితం కావడం మింగుడుపడనిదే.
టాపిక్