Paramannam Recipe । ఉగాది సందర్భంగా పరమాన్నం తినండి, నోరు తీపిచేసుకోండి!
Ugadi 2023 Paramannam Recipe: ఉగాది పండగ సందర్భంగా నోరు తీపి చేసుకోండి, సాంప్రదాయమైన ఉగాది పరమాన్నం రుచిచూడండి, రెసిపీ ఇక్కడ తెలుసుకోండి.
Ugadi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది పండుగను నూతన సంవత్సర ఆరంభంగా జరుపుకుంటారు. చైత్ర మాసం మొదటి రోజున భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులు జరుపుకునే పండగ ఉగాది. వసంత రుతువుకు స్వాగతం పలుకే రోజు కూడా ఇదేనని నమ్ముతారు. ఉగాది పర్వదినం తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజున పంచాగ శ్రవణంతో పాటు, షడ్రుచులను పంచే ఉగాది పచ్చడిని తీసుకోవడం అనవాయితి. పులిహోర, బొబ్బట్లు, పరమాన్నం వంటి సాంప్రదాయ వంటకాలు కూడా వండుకొని తింటారు.
ఉగాది పండగ తెలుగు సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది కాబట్టి, ఈరోజున మీ నోరు తీపిచేసుకునేందుకు సాంప్రదాయమైన పరమాన్నం రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. పరమాన్నం మధురమైన రుచిని కలిగి ఉంటుంది, ఆరోగ్యకరమైనది. అసలైన పండగ రుచిని మీకు అందిస్తుంది. పరమాన్నం రెసిపీ ఈ కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేర్కొన్న సూచనల ప్రకారంగా, సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.
Paramannam Recipe కోసం కావలసినవి
- 4 కప్పుల పాలు
- 1/2 కప్పు బియ్యం
- 4 పచ్చి ఏలకులు
- 1 కప్పు బెల్లం లేదా చక్కెర
- 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
- డ్రైఫ్రూట్స్
పరమాన్నం వండే విధానం
- ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నీటిలో నానబెట్టండి.
- ఈలోపు ఒక కుండలో పాలు తీసుకొని, మీడియం మంట మీద మరిగించాలి.
- అనంతరం నానబెట్టిన బియ్యంను మరిగే పాలలో వేసి ఉడికించాలి.
- అవసరం మేరకు మరికొన్ని పాలు పోసి, అన్నం మెత్తగా ఉడికేవరకు ఉడికించాలి.
- మరొక గిన్నెలో అరకప్పు నీళ్లు, తురిమిన బెల్లం వేసి బెల్లం పాకం తయారు చేసుకోవాలి.
- అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం పాకం చల్లబరిచి వేయాలి, అలాగే యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి.
- మరో చిన్న పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. ఆపై జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. వీటిని కూడా అన్నం పాయసంలో కలుపుకోవాలి.
- చివరగా నట్స్, డ్రైఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి.
అంతే, పరమాన్నం రెడీ. దీనిని వేడివేడిగా తినవచ్చు లేదా చల్లగా కూడా తినవచ్చు. పండగ సందర్భంగా పరమాన్నం తినండి, నోరు తీపిచేసుకోండి.
సంబంధిత కథనం