Home Tips: డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై మరకలు సరిగా పోవడం లేదా? ఈ టిప్స్ పాటిస్తే శుభ్రంగా మెరిసిపోతుంది!
Dressing table mirror cleaning Tips: డ్రెస్సింగ్ టేబుల్‍కు ఉండే అద్దానికి తరచూ దుమ్ము పడుతూ ఉంటుంది. అది పేరుకుపోతూ ఉంటుంది. తరచూ క్లీన్ చేయాల్సి ఉంటుంది. అయితే, సరైన పద్ధతిలో క్లీన్ చేస్తే మెరుగ్గా ఉంటుంది. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి.
డ్రెస్సింగ్ టేబుల్ గదికి ఓ స్పెషల్ అట్రాక్షన్‍లా ఉంటుంది. పెద్ద అద్దంతో కంటికి ఇంపుగా కనిపిస్తుంటుంది. దీన్ని నిత్యం వాడేస్తుంటాం. అలాగే డ్రెస్సింగ్ టేబుల్‍కు ఉన్న అద్దానికి తరచూ దుమ్ము పడుతూనే ఉంటుంది. కొన్ని రోజుల్లోనే ఎక్కువగా దుమ్ము పేరుకుపోతుంది. ఇలాగే ఉంటే అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనిపించదు. లుక్ పోతుంది. అందుకే తరచూ క్లీన్ చేయాల్సి ఉంటుంది. అయితే, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. లేకపోతే గీతలు, మరకలు పడే ప్రమాదం ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం శుభ్రం చేసేందుకు టిప్స్ ఇక్కడ చూడండి.
స్ప్రే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
డ్రెస్సింగ్ టేబుల్ అద్దం క్లీన్ చేసేందుకు ప్రత్యేకంగా గ్లాస్ క్లీనర్స్ దొరుకుతాయి. లేకపోతే ఇంట్లోనే ఓ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. వైట్ వెనిగర్, గోరువెచ్చని నీటిని సమపాళ్లలో కలిపితే స్ప్రే రెడీ అవుతుంది. దాన్ని స్ప్రై బాటిల్‍లో నింపేయాలి. ఇది అద్దంపై మరకలను బాగా వదిలించగలదు.
క్లీన్ చేసేందుకు ఇవి..
డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని క్లీన్ చేసేందుకు మృధువుగా ఉండే మైక్రో ఫైబర్ క్లాత్‍నే వాడాలి. సాధారణ టవల్స్, పేపర్లు లాంటివి వినియోగిస్తే గీతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మైక్రోఫైబర్ క్లాత్‍నే వాడాలి. స్ప్రే చేసేందుకు గ్లాస్ క్లీనర్ లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న వెనిగర్, గోరువెచ్చని నీటి మిశ్రమాన్ని తీసుకోవాలి. దాన్ని స్ప్రే బాటిల్‍లో పోసుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్ అంచుల వెంట శుభ్రం చేసేందుకు దూదిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
క్లీనింగ్ ప్రాసెస్ ఇలా..
- దుమ్ము దులపాలి: ముందుగా డ్రెస్సింగ్ టేబుల్‍పై ఉన్న పొడి దుమ్మును మైక్రోఫైబర్ క్లాత్ లేకపోతే ఏదైనా సాఫ్ట్ బ్రష్‍తో తుడిచేయాలి. పొడి దుమ్మును పూర్తిగా పోగొట్టాలి. ఇలా చేస్తే గీతలు పడకుండా ఉంటుంది.
- స్ప్రే చేయాలి: ఆ తర్వాత అద్దంపై గ్లాస్ క్లీనర్ కానీ, ఇంట్లో తయారు చేసుకున్న వైట్ వెనిగర్ మిశ్రమం స్ప్రే చేయాలి. అద్దమంతా సమానంగా స్ప్రే అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- తుడవడం ఇలా: ఆ తర్వాత అద్దాన్ని మైక్రోఫైబర్ క్లాత్‍తో తుడవాలి. పై నుంచి కిందికి తుడుస్తూ రావాలి. మొత్తం కవర్ అయ్యేలా ఎస్ షేప్‍లో కానీ.. జిగ్‍జాగ్‍గా కానీ క్లీన్ చేయాలి. ఒత్తిడి ఎక్కువగా చేయకూడదు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుంగా మొత్తం కవర్ అయ్యేలా తుడవాలి.
- ఆరేందుకు..: అద్దంపై ఎలాంటి తేమ లేకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం పొడిగా ఉండే మరో మైక్రోఫైబర్ క్లాత్‍తో అద్దం మొత్తాన్ని మరోసారి తుడవాలి. అద్దం తడిగానే ఉంటే త్వరగా దుమ్ము అతుక్కునే అవకాశం ఉంటుంది. అందుకే పొడిగా ఉండేలా చేయాలి.
- అంచులను దూదితో..: డ్రెస్సింగ్ టేబుల్ అంచుల వరకు మైక్రో ఫైబర్ క్లాత్ వెళ్లకపోయి ఉండొచ్చు. ఇలా అంచుల్లో ఏదైనా దుమ్ము, మరక కనిపిస్తే దూదిని చిన్న ఉండగా చేసి.. దాంతో క్లీన్ చేయాలి. సాఫ్ట్ బ్రష్ కూడా వాడొచ్చు. దీనివల్ల అంచులు కూడా శుభ్రంగా అవుతాయి. అద్దం మొత్తం తళతళలాడుతుంది.