Halim Seeds: హలీం గింజల గురించి విన్నారా? వీటిని రోజు తింటే చర్మం మెరిసిపోతుంది
Halim Seeds: హలీం పేరు వింటే అందరికీ రంజాన్ నెల గుర్తొస్తుంది. నిజానికి హలీంకు, హలీం గింజలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిని ఆహారంలో భాగం చేసుకోమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
Halim Seeds: హలీం గింజలు సాధారణ ధరకే ఆన్ లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. అవిసె గింజలు, నువ్వులు, ఇతర నట్స్ లాగే ఇవి కూడా ఆరోగ్యాన్ని అందించే విత్తనాలుగా చెప్పుకోవాలి. హలీం పేరు వినగానే అందరికీ చికెన్, మటన్ హలీంలు గుర్తొస్తాయి. ఈ హలీం గింజలకు, ఆ హలీం వంటకానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ హలీం గింజలను ఆలివ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. అలా అని ఇవి ఆలివ్ నూనె తయారయ్యే గింజలని మాత్రం అనుకోవద్దు. అవి వేరు, ఇవి వేరు. ఈ హలీం విత్తనాలను ‘గార్డెన్ క్రెస్’ అని పిలిచే మొక్కల నుండి సేకరిస్తారు. ఇవి శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గత శతాబ్దాలుగా హలీం గింజలను తింటున్న వారు ఉన్నారు. దీన్ని కొంతమంది సాంప్రదాయ ఔషధంగా భావిస్తారు. అనేక ఔషధాల్లో వీటిని ఉపయోగిస్తారు.
హలీం గింజలు ఎందుకు తినాలి?
హలీం గింజలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అలసట, జీర్ణ సంబంధిత రోగాలు రావు. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను దూరం పెడుతుంది. ఆయుర్వేద వైద్యంలో జుట్టు రాలడాన్ని ఆపే మందుల్లో ఈ హలీం విత్తనాలను వినియోగిస్తున్నారు. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన కొవ్వు పదార్థాలు. కాబట్టి హలీం గింజలను తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను పుష్కలంగా పొందవచ్చు. గుండె ఆరోగ్యం, మెదుడు పనితీరుకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అవసరం పడతాయి.
హలీం గింజల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. హలీం గింజలు తింటే రెండు వారాల్లోనే రక్తహీనత సమస్య మాయమైపోతుంది. హలీం విత్తనాలలో లైసెన్ ఉంటుంది. ఇది కణజాలాలను మరమ్మతు చేస్తుంది. కణజాలాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. దెబ్బతిన్న కణాలను సరి చేయడానికి ఇది సహాయపడుతుంది. హలీం గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ ఇ ఉంటాయి. ఈ రెండూ జుట్టు, చర్మ ఆరోగ్యానికి అవసరం. చర్మం కాంతివంతంగా ఉంచేందుకు, జుట్టును పెరిగేలా చేసేందుకు హలీం గింజలు దోహదపడతాయి. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టు, చర్మం మెరిసేలా చేస్తాయి.
గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ గింజలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఎన్నో సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ హలీం గింజలతో లడ్డూలు, ఉప్మా వంటివి చేసుకోవచ్చు. వీటిని పొడి రూపంలో మార్చి తినవచ్చు. ఎలా తిన్నా ఆరోగ్యానికి మేలే.