Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు-friendship marriage is a new relationship trend where there is no sex involved in this marriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Friendship Marriage: ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ఇదొక కొత్త రిలేషన్‌షిప్ ట్రెండ్, ఈ పెళ్లిలో ఆ ముచ్చటే ఉండదు

Haritha Chappa HT Telugu
May 12, 2024 01:15 PM IST

Friendship Marriage: ఆధునిక కాలంలో కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు జపాన్లో ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇది మిగతా దేశాలకు కూడా పాకే అవకాశం ఉంది.

ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే ఏమిటి?
ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే ఏమిటి? (pixabay)

Friendship Marriage: పెళ్లంటేనే రెండు జీవితాల కలయిక. రెండు కుటుంబాల వేడుక. ఆధునిక కాలంలో పెళ్లికి అర్థమే మారిపోతోంది. పెళ్ళికి ముందే సహజీవనం చేస్తున్న జంటలు ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు జపాన్లో మరొక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ఫ్రెండ్షిప్ మ్యారేజ్. అంటే స్నేహితులు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం అనుకోవద్దు. ఇదొక విచిత్రమైన ట్రెండ్ మీరు పెళ్లి చేసుకుంటారు. ఒకే ఇంట్లో కలిసి జీవిస్తారు. కలిసి మెలిసి తింటారు. పిల్లల్ని కూడా కంటారు. కానీ ఎలాంటి లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోరు. అంటే వారిద్దరూ శారీరకంగా ఒకరికి ఒకరు దూరంగా ఉంటారు. అదే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ఉద్దేశం.

ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే

లైంగిక సంబంధాలను ఇష్టపడని వారు ఇలా ఫ్రెండ్షిప్ మ్యారేజ్‌లు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. వారు చట్టబద్ధంగానే వివాహం చేసుకుంటారు. లైంగిక చర్యకు మాత్రం దూరంగా ఉంటారు. అలా అని పిల్లలు వద్దనుకోరు. పిల్లలను కూడా కంటారు. ఇలా పిల్లలను కనేందుకు కృత్రిమ వైద్య మార్గాలను ఎంచుకుంటారు. జపాన్లో వేలాది మంది యువత ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ లను చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

2015 నుంచి ఈ ట్రెండు మొదలైంది. ఆ ఏడాది దాదాపు 500 మంది ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లి చేసుకోవడానికి ముందే వీరు అన్ని విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. వారి భోజన ప్రాధాన్యతలు, ఆసక్తులు, ఖర్చులు అన్నింటిని షేర్ చేసుకుంటారు. కానీ ఎలాంటి లైంగిక అనుబంధాన్ని పెట్టుకోకూడదనే ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆ తర్వాతే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ కి సిద్ధమవుతారు. 2015తో పోలిస్తే ఇప్పుడు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ చేసుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని జపాన్ కు చెందిన సంస్థల నివేదికలు చెబుతున్నాయి.

ఫ్రెండ్షిప్ మ్యారేజ్ గురించి చెబుతూ ‘వీరు స్నేహితులు కంటే ఎక్కువ ప్రేమికుల కంటే తక్కువ’ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. ప్రస్తుతం జపాన్లోనే ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ లు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇతర దేశాలకు త్వరలోనే పాకవచ్చు.

స్లీప్ డివోర్స్

మన దేశంతో పాటు పాశ్చాత్య దేశాల్లో కూడా మరొక కొత్త రిలేషన్షిప్ ట్రెండ్ కనిపిస్తోంది. అదే స్లీప్ డివోర్స్. అంటే ఇద్దరు భార్యాభర్తలు విడాకులు తీసుకోరు. ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు. ప్రేమగా జీవిస్తారు. కానీ రాత్రి నిద్ర పోయేటప్పుడు మాత్రం వారి పడకలు విడివిడిగా ఉంటాయి. వారి నిద్రపోయే విధానాలు, షెడ్యూలు కూడా వేరేగా ఉంటాయి. అదే స్లీప్ డివోర్స్. రోజంతా కలిసి ఉండేవారు... రాత్రికి మాత్రం విడివిడిగా పడుకుంటారు. ఇదే ఈ ట్రెండ్ లో కొత్తదనం. అయితే వీరు లైంగిక సంబంధానికి మాత్రం దూరంగా ఉండరు. కొందరికి గురక పెట్టే అలవాటు ఉంటుంది. అది భరించలేని వారు ఇలా ఎక్కువగా స్లీప్ డివోర్స్ కు వెళ్తూ ఉంటారు. ఈ ఆధునిక కాలంలో భవిష్యత్తులో ఇంకెన్ని కొత్త విధానాలు పుట్టుకొస్తాయో చూడాలి.

Whats_app_banner