Friday Motivation | మనం జన్మతో కాదు.. చేసే కర్మలతో చిన్నా, పెద్దా అవుతాం!
Friday Motivation: జీవితంలో సంతోషం ఉండాలంటే కష్టపడాలి. కష్టపడే తత్వం ఉన్నవారు ఎప్పటికైనా ఒక్కోమెట్టు ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకుంటారు.
Friday Motivation: జీవితంలో సంతోషం ఉండాలంటే మనకు ఉన్నదానితో తృప్తిగా బ్రతకాలి, మరింత ఉన్నతంగా బ్రతికేందుకు కష్టపడాలి. కష్టపడే తత్వం ఉన్నవారు ఎప్పటికైనా ఒక్కోమెట్టు ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకుంటారు. వారికి జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా ముందుకు సాగుతూనే ఉంటారు, ఎందుకంటే వారికి కష్టం అనేది కొత్త కాదు. కష్టపడే వారికి ఆత్మగౌరవం కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వారు ఇతరులపై ఆధారపడి బ్రతికేవారు కాదు, ఇంకొకరిని మోసం చేస్తూ సంపాదించే వారు కాదు. వారి వద్ద ఉండే ఒక్కో రూపాయి కూడా వారి కష్టార్జితమే. అవసరమైతే వారు తమ వద్ద ఉన్న దాంట్లో ఇతరులకు ఇస్తారేమో కానీ, ఇంకొకరి వద్ద చెయ్యి చాచరు. వారి చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది.
మన చుట్టూ ఉన్నవారిలో కొంతమందికి డబ్బు, ఆస్తి, అంతస్తులు ఉండచ్చు గాక, కానీ కష్టపడి సంపాదించిన వారికి మాత్రమే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. వేరొకరిని వంచించి మేడలు కడితే ఆరోజుకు ఆనందం ఉంటుందేమో.. కానీ ఏదో ఒకరోజు అక్రమ సంపాదనంతా పేకమేడలా కూలిపోతుంది. ఇలా కష్టపడకుండా సంపాదించే వారికి డబ్బు నిలవదు, వారికి ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. అలాంటి వారికి ఆత్మగౌరవం అసలే ఉండదు. ఎవరు ఎంత ఛీదరించుకున్నా వారికేమి పట్టనట్లు ఉంటారు. కానీ కష్టపడి సంపాదించిన వారికి ఒక గర్వం ఉంటుంది, వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు, ఎందరో మంది అభిమానాన్ని చూరగొంటారు. వారి వద్ద కొంచెమే ఉన్నా, అందరి అభిమానం ఉంటుంది. అందుకే అంటారు, మనం జన్మతో కాదు.. చేసే కర్మలతో చిన్నా- పెద్దా అవుతాం అని.
కొంతమంది తమ వద్ద ఏమీ లేకపోయినా చాలా గొప్పలు చెప్పుకుంటారు. తాము ఇంత, తాము అంత అంటూ చెప్పుకోవడమే వారి పని తప్ప, వారు చేసేదేమి ఉండదు. వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటున్నారంటే వారి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదని అర్థం. అందుకే తమ గుర్తింపు కోసం తహతహలాడుతారు. వీరు కేవలం గొప్పలు చెప్పుకుంటూనే కాలం వెల్లదీస్తారు, గొప్పలకు పోయి ఏదైనా పని చేయడానికి కూడా చిన్నతనంగా భావిస్తారు. కానీ, కష్టపడేవారికి ఏ పని చిన్నది కాదు. పనియే దైవం అనే సామెత వినే ఉంటారు. పనిలో చిన్నది పెద్దది అని ఉండదు, నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వహిస్తే అదే నిన్ను పెద్దవాణ్ని చేస్తుంది. దేవునికి పూజ చేయకపోయినా, నీ పనిని నువ్వు గౌరవించి అంకితభావంతో పనిచేస్తే అదే నిన్ను దైవంలా కాపాడుతుంది.
చివరగా ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోకుండా మీరు మీలా ఉండండి, మీ పని మీరు చేయండి, ఆత్మగౌరవంతో బ్రతకండి, ఇదే మిమ్మల్ని జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఉన్నతస్థానంలో నిలబెడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్