Breastfeeding -Foods to Avoid | పాలిచ్చే తల్లులు ఇలాంటి ఆహారాలు తినకపోవడమే మంచిది!
Breastfeeding Week: పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి ఆహారాలు తినకూడదో (foods to avoid when breast feeding) ఇక్కడ తెలుసుకోండి.
Breastfeeding Week: శిశువులకు పాలిచ్చే తల్లులు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చిన నుండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఎలాగైతే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలో, బిడ్డకు పాలు ఇచ్చే సమయంలోనూ తల్లి కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. ఎందుకంటే తల్లి ఏ ఆహారం అయితే తీసుకుంటుందో, అదే ఆహారం బిడ్డకు పాల రూపంలో చేరుతుంది. కాబట్టి సరైన పోషకాహారం తీసుకుంటే మంచి పోషకాలు బిడ్డకు అందుతాయి. తల్లి తీసుకున్న ఆహారంలో ఏవైనా అలెర్జీ కారకాలు, హానికర సమ్మేళనాలు ఉంటే, పాలు ఇచ్చినపుడు అవి బిడ్డకూ చేరతాయి. అది శిశువు ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలిచ్చే ఎలాంటి ఆహారాలు తినకూడదో (foods to avoid when breast feeding) ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్డ్ ఫుడ్
శిశువు అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కాబట్టి అందుకు తగినట్లు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అవసరం. కాబట్టి పాలిచ్చే తల్లులు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల జోలికి వెళ్లకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారం వివిధ రకాలుగా శిశువు శరీరానికి హాని కలిగిస్తుంది, వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మొదలైన వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బిడ్డకు చేరితే వారిలో చిన్నతనం నుంచే ఊబకాయం, మధుమేహం రావచ్చు.
ఆల్కహాల్
పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ సంబంధిత పానీయాలను తీసుకోకూడదు, ఎందుకంటే అది మీ పాల ద్వారా మీ బిడ్డకు చేరి వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఇది నేరుగా శిశువుకు ఆల్కాహాల్ తాగించిన ప్రభావాలను కలిగిస్తుంది. ఆల్కాహాల్ తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు మద్యానికి దూరంగా ఉండాలి. బీర్, వైన్ వంటి ఏ విధమైన పానీయాలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే సుమారు 2-4 గంటల వరకు లేదా ఆ అల్కాహాల్ ప్రభావం పూర్తిగా వదిలే వరకు బిడ్డకు పాలు పట్టకూడదు.
కారంగా ఉండే ఆహారాలు
కారంగా ఉండే ఆహారాలు కొన్నిసార్లు శిశువులలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి, కాబట్టి మీ బిడ్డకు జీర్ణ సమస్యలు తలెత్తకుండా నివారించడానికి స్పైసీ ఫుడ్ కాకుండా, తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలు మితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే వీటి వల్ల పిల్లలకు కడుపులో గ్యాస్ సమస్య తలెత్తవచ్చు.
ఆవు పాలు
పాలిచ్చే తల్లులు ఆవు పాలు తాగేటపుడు, ఇతర డెయిరీ ఉత్పత్తులు తీసుకునే సందర్భంలో జాగ్రత్త వహించాలి. మీ శిశువుకు లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉన్నట్లయితే, మీరు ఆవు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవచ్చో డాకర్లను సంప్రదించండి.
కెఫీన్ ఉత్పత్తులు
పాలిచ్చే తల్లులు కాఫీ, టీలు మితంగా తీసుకోవాలి. అలాగే కోలావంటి అధిక కెఫీన్ కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి. కెఫిన్, సోడా, టీ, కాఫీ, చాక్లెట్ వంటి ఆహారాలు గర్భధారణ తర్వాత ప్రయోజనకరంగా ఉండవు. ప్రత్యేకించి బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న తల్లులు అలాంటి పానీయాలు లేదా ఆహారం తీసుకుంటే వివిధ సమస్యలను ఎదుర్కొంటారు. మీరు అధిక మొత్తంలో కాఫీ, టీలను తీసుకుంటే అది మీ శిశువు నిద్రలేమికి కారణం కావచ్చు.
కొన్ని రకాల చేపలు
పాలిచ్చే తల్లులు సీఫుడ్ తీసుకోవచ్చు కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్, షార్క్ వంటి కొన్ని రకాల చేపల్లో మీ శిశువు అభివృద్ధికి హాని కలిగించే అధిక స్థాయి పాదరసంను కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని నివారించాలి.
సంబంధిత కథనం