Eye Exercises : అమూల్యమైన కళ్ల కోసం 10 నిమిషాలు, ఈ వ్యాయామాలతో కళ్లు పదిలం-eye exercises that improve vision and eye sight eye health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Exercises : అమూల్యమైన కళ్ల కోసం 10 నిమిషాలు, ఈ వ్యాయామాలతో కళ్లు పదిలం

Eye Exercises : అమూల్యమైన కళ్ల కోసం 10 నిమిషాలు, ఈ వ్యాయామాలతో కళ్లు పదిలం

Koutik Pranaya Sree HT Telugu
Sep 09, 2024 05:00 AM IST

Eye Exercises : శరీరం మొత్తం ఆరోగ్యం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తాం. మరి కళ్ల సంగతేంటీ? దృష్టిలోపం రాకుండా ఉండటానికి, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి ఈ కంటి వ్యాయామాలు చేయండి.

కంటి చూపు మెరుగుపరిచే వ్యాయామాలు
కంటి చూపు మెరుగుపరిచే వ్యాయామాలు (freepik)

కంటి దృష్టి బాగుండటం ఎంతో ముఖ్యమైన విషయం. ఏ మాత్రం చూపు తగ్గినా తర్వాత కళ్ల జోళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. కళ్లద్దాలు వచ్చాక గానీ కంటి చూపు విలువ సరిగ్గా తెలీదు. అందువల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంత వరకు పరిస్థితి వెళ్లకుండా ఉండాలంటే మన కంటి చూపును రక్షించుకునే కొన్ని వ్యాయామాలను తరచుగా చేస్తూ ఉండాలి. ఇవి కంటి ఆరోగ్యం కాపాడతాయి.

కంటి వ్యాయామాలు

1. అరచేతులతో

రెండు అరచేతుల్నీ బాగా రుద్దుకుని కాస్త వేడి కానివ్వండి. అప్పుడు వాటిని తీసుకుని కళ్లపై నిమిషం పాటు అలా పెట్టుకోండి. అందువల్ల కళ్ల దగ్గర ఉన్న నరాలు, కండరాలు స్వాంతన పొందుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.

2. పెన్సిల్‌తో

ఈ కంటి వ్యాయామం చేయడానికి 20 అడుగుల దూరం ఉండే ఒక విశాలమైన గదిని ఎంచుకోండి. ముందుగా సుఖాసనంలో హాయిగా కూర్చోండి. ఒక పెన్సిల్‌ని తీసుకుని దాన్ని కళ్ల ఎదురుగా ఆరు ఇంచుల దూరంలో ఉంచుకోండి. దానికి అవతల 20 అడుగుల దూరంలో మరో పెన్సిల్‌ని పెట్టుకోండి. ఒక పది సెకన్లు దూరంగా ఉన్న పెన్సిల్‌పై దృష్టిని కేంద్రీకరించండి. అలాగే మరో పది సెకన్లు దగ్గరగా ఉన్న పెన్సిల్‌పై దృష్టి పెట్టండి. ఇలా దృష్టిని అటూ ఇటూ వేగంగా మారుస్తూ ఉండటం కనీసం పది సార్లైనా చేయండి. ఇది మీ దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటి దృష్టి లోపం రాకుండా చూస్తుంది.

3. ఎనిమిది ఆకారం ఊహించి

మీరు కుర్చున్న చోటికి కనీసం పది అడుగల దూరంలో గోడపై ఓ పెద్ద ఎనిమిది బొమ్మను ఊహించుకోండి. ఆ ఆకారంలో కళ్లను తిప్పండి. ఓ 30 సెకెన్లపాటు సవ్య దిశలో కళ్లతో ఎనిమిది అంకెను వేయండి. మరో 30 సెకెన్లు అపసవ్య దిశలో తిప్పండి. కనుగుడ్లను ఇలా తిప్పడం వల్ల కళ్ల కదలిక మెరుగుపడుతుంది.

4. బొటనవేళ్లు చూస్తూ

నిదానంగా నిలబడి చేతులను ముఖం ఎదురుగా చాపండి. వేళ్లని ముడిచి రెండు బొటను వేళ్లనూ పైకి ఉంచండి. వాటిని కొద్ది సెకన్లపాటు తీక్షణంగా చూడండి. తర్వాత చేతుల్ని నెమ్మదిగా కళ్లకు మూడు అంగుళాల దగ్గరి వరకు తీసుకురండి. అలా బొటను వేళ్ల పైవే చూస్తూ ఉండండి. తర్వాత మళ్లీ దూరంగా జరపండి. ఇలా రోజుకు మూడు సార్లు చేయండి. కళ్ల అలసట తగ్గుతుంది.

మరికొన్ని టిప్స్:

మన కళ్లు తడిగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు అక్కడ కొంత నూనె లాంటిది స్రావాలుంటాయి. అది కనుగుడ్డు అంతటా చేరాలంటే మనం కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. అలా తగినంతగా మూయడం, తెరవడం చేయకపోతే అవి పొడిబారిపోయి అసౌకర్యంగా అనిపించే ప్రమాదం ఉంది.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే 20 - 20 - 20 రూల్‌ అనేది చాలా ముఖ్యం. కంప్యూటర్ల ముందు పని చేసుకుంటున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దాన్ని చూడటం కచ్చితంగా చేయాలి.

టాపిక్