Relationship post-children । పిల్లలు పుట్టిన తర్వాత మీ వివాహబంధంలో గొడవలా? నిపుణుల సలహా ఇదీ!
Relationship post-children: పిల్లలు పుట్టిన తర్వాత వివాహబంధం మరో మలుపు తీసుకుంటుంది. ఇద్దరి మధ్య నిపుణుల సలహాలు చూడండి.
Relationship post-children: ఏ వివాహబంధం అయినా పిల్లలు పుట్టిన తర్వాత మరో మలుపు తీసుకుంటుంది. మీ జీవితంలోకి ఒక బేబీ రావడం మీకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. మీకు చాలా ఉత్సాహంగా, అద్భుతంగా అనిపిస్తుంది. అదే సమయంలో బిడ్డను ఎలా చూసుకోవాలి, ఎంత బాగా సంరక్షించాలనే దానిపై తల్లిదండ్రులిద్దరికీ బెంగ ఉంటుంది. బిడ్డ సంరక్షణ విషయంలో కొన్నిసార్లు ఇద్దరి మధ్య విబేధాలు కూడా తలెత్తవచ్చు. సంబరంగా, సంతోషంగా వేడుకలు చేసుకోవాల్సిన ఇంట్లో నిత్యం గొడవలు జరగవచ్చు. అయితే, ఇందుకు అనేక అంశాలు కారణం అవుతాయి.
ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల ఇద్దరి మధ్య ప్రేమ, సాన్నిహిత్యం తగ్గుతుంది. వారి దృష్టి పూర్తిగా శిశువుపైకి మళ్లుతుంది. ఇది దంపతుల మధ్య మరోరకంగా వాదనలు, వివాదాలు ఇతర సమస్యలు తలెత్తడానికి దారితీస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత మీ భాగస్వామితో గొడవలు రాకుండా మీ సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అవేమిటో తెలుసుకోండి.
సాన్నిహిత్యం
చాలా మంది కొత్త జంటలు బిడ్డను కన్న తర్వాత భౌతికంగా ఒకరికొకరు కొంత దూరం జరుగుతారు. వారు తమ మధ్య సాన్నిహిత్యం గురించి ఫిర్యాదు చేస్తారు. ప్రసవం తర్వాత స్త్రీ శరీరం గణనీయమైన మార్పులకు గురవుతుంది. నాలుగు నుండి ఆరు వారాలలో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన సమస్యలకు దారితీయవచ్చు. ఈ వ్యవధి తర్వాత, మీరు మీ వైద్యుడిని సంప్రదించి, మీ లైంగిక జీవితంలో చురుకుగా పాల్గొనేందుకు ప్రయత్నించండి.
పనులు పంచుకోండి
బిడ్డ పుట్టాక ఒకవైపు బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడం, మరోవైపు ఇంటిపనులు చూసుకోవడం, ఇతర పనులు చేసుకోవడం అనేది ఒక్కరితో అయ్యే పనికాదు. ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోండి, శిశువు బాధ్యతలను పంచుకోండి. ఇంటి పనులు చేస్తూ మీరిద్దరూ ఆనందించే కార్యకలాపాలలో నిమగ్నం అవుతుండండి.
సమయం కేటాయించుకోండి
బంధం సజీవంగా ఉంచడానికి ఒకరికొకరు తగినంత సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. మీరు మీకు పుట్టిన బిడ్డపై ఎక్కువ ప్రేమిస్తుండవచ్చు గాక, ఆ ధ్యాసలో పడి మీ భాగస్వామికి సమయం ఇవ్వకపోవచ్చు. కానీ సమయం తీసుకొని వారితో మాట్లాడాలి. ఇప్పటికీ వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, వారిని ఎంతగా ఆరాధిస్తారో వివిధ రూపాలలో తెలియజేయండి.
ఇతరుల జోక్యాన్ని నివారించండి
కొన్ని సందర్భాల్లో, మీ ఇద్దరి మధ్య ఇతర కుటుంబ సభ్యుల జోక్యం ఉండవచ్చు. ముఖ్యంగా మీ తగాదాలలో మీ తల్లిదండ్రులను జోక్యం చేసుకోకుండా చూసుకోండి, వాటిని మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దంపతుల మధ్య చాలా వరకు గొడవలు వారి తల్లిదండ్రుల కారణంగానే తలెత్తుతాయి. ఇక్కడ మీరు దృఢంగా ఒకరికి అండగా ఒకరు నిలవాలి.
రెండవ బిడ్డ పుడితే సంయమనం
మొదటి బిడ్డ పుట్టినపుడు కొన్ని సమస్యలను కలిగితే, రెండవ కాన్పు తర్వాత ఆ సమస్యలు మరింత పెరుగుతాయి. పెరిగిన ఒత్తిడి మరింత వాదనలకు కారణమవుతుంది. ఇది బిడ్డలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో విషపూరితమైన వాతావరణాన్ని నివారించడానికి చాలా విషయాలలో సంయమనం పాటించడం నేర్చుకోండి.
నిపుణులు అందించిన ఈ సలహాలను పాటించడానికి ప్రయత్నించండి, మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు.
సంబంధిత కథనం