Eggless Cake: గోధుమ పిండితో ఎగ్ లెస్ కేక్, పిల్లలకు బాగా నచ్చడం ఖాయం
Eggless Cake: కేకు అనగానే మైదాపిండితో చేసేదే గుర్తొస్తుంది. గోధుమ పిండితో... కోడిగుడ్లు వేయకుండా శాకాహార పద్ధతిలో కేకును తయారు చేయవచ్చు. కేక్ రెసిపీ ఎలాగో చూద్దాం.
Eggless Cake: బయట అమ్మే కేకులను మైదాపిండితో తయారుచేస్తారు. అలాగే కోడిగుడ్లను కూడా వేస్తూ ఉంటారు. ఎగ్ లెస్ కేకులు ప్రత్యేకంగా ఆర్డర్ చేయవలసి వస్తుంది. మీరు ఇంట్లోనే కోడిగుడ్లు వేయకుండా గోధుమ పిండితో టేస్టీగా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్య కరం కూడా. మైదా పిండితో చేసిన కేకులు తినడం వల్ల భవిష్యత్తులో అనారోగ్యాలు త్వరగా వస్తాయి. కానీ గోధుమ పిండితో చేసిన కేకు ను తింటే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. దీన్ని చాలా సింపుల్ పద్ధతిలో తయారు చేయవచ్చు. ఎగ్ లెస్ కేక్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
గోధుమ పిండితో ఎగ్ లెస్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
పాలు - అర లీటరు
పంచదార - అర కప్పు
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూన్
బేకింగ్ సోడా - అర స్పూను
ఉప్పు - అర స్పూను
కార్న్ ఫ్లోర్ - మూడు స్పూన్లు
వెజిటబుల్ ఆయిల్ - అరకప్పు
గోధుమపిండితో ఎగ్ లెస్ కేక్ రెసిపీ
1. ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో గోధుమపిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడ, ఉప్పు వేసి బాగా కలపాలి.
2. ముందుగా వీటిని జల్లెడ పట్టుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి.
3. అందులోనే వెజిటబుల్ ఆయిల్, వెనీలా ఎసెన్స్ వేసి మళ్లీ బాగా గిలక్కొట్టాలి.
4. తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా వేసి బాగా కలపాలి.
5. కేకు తయారు చేయడానికి కావలసిన పిండి రెడీ అయినట్టే.
6. ఇప్పుడు ఓవెన్ లో చేసేవారు ముందుగా ఓవెన్‌ను ప్రీ హీట్ చేసుకోవాలి.
7. 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి.
8. కేకు మౌల్డ్ లో అడుగున కాస్త బటర్ రాసి గోధుమ పిండిని చల్లుకోవాలి.
9. అందులో కేకు పిండి మిశ్రమాన్ని వేసి నేలపై మెల్లగా తట్టాలి.
10. ఇలా చేయడం వల్ల ఎక్కడా గాలి బుడగలు లేకుండా కేకు తయారవుతుంది.
11. ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టి అరగంట పాటు ఉంచాలి.
12. కొన్నిసార్లు 40 నిమిషాల సమయం పడుతుంది.
13. టూత్ పిక్‌తో గుచ్చి కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్‌కు కేకు మిశ్రమం అంటుకుంటే కేక్ ఇంకా ఉడకాలని అర్థం. 40 నిమిషాల్లో కేకు రెడీ అయిపోతుంది. దాన్ని తీసి ముక్కలుగా కట్ చేసి పిల్లలకు ఇవ్వండి. వారు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
కేకులో మనం కోడిగుడ్లకు బదులుగా పాలను వేసుకున్నాము. ఇందులో బాదం పిండిని కూడా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. శాఖాహారులు కేకులు ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే కోడిగుడ్ల అవసరం ఉండదు. ఇందులో మనము గోధుమలు ఉపయోగించాం. కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. పాలు, గోధుమలు ఈ రెండే వీటిలో ప్రధానంగా మనము వినియోగించింది. గోధుమపిండి వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
అన్నంతో పోలిస్తే గోధుమపిండి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేయడంలో ఇది ముందుంటుంది. ఎంతోమంది బరువు తగ్గడానికి గోధుమపిండితో చేసిన రొట్టెలను, చపాతీలను తినడానికి ఇష్టపడతారు. కాబట్టి గోధుమపిండితో చేసిన కేకు తినడం అన్ని విధాలా మంచిదే. దీన్ని చాలా సింపుల్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఓవెన్ లేనివారు కుక్కర్ లో కూడా దీని తయారు చేయవచ్చు. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ మౌల్డ్ ను పెట్టి మూత పెట్టేయాలి. విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. యాభై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే కేకు రెడీ అయిపోతుంది. పైన మీకు నచ్చిన పండ్లతో గార్నిష్ చేసుకొని కేకులు తినవచ్చు.