Biscuit Cake: కొత్త ఏడాదిని ఈ బిస్కెట్ కేకుతో స్వాగతం పలికేయండి, రెసిపీ వెరీ ఈజీ
Biscuit Cake: కొత్త ఏడాదిలో కేకుని కట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే బిస్కెట్లతో కేకును తయారు చేయండి.
Biscuit Cake: కొత్త ఏడాదిలో ఇంట్లోనే టేస్టీగా బిస్కెట్లతో కేకును తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సులువు. బిస్కెట్లతోనే చేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా కేకుకు వస్తుంది. ఒకసారి ఈ కేకును ఇంట్లో చేసి చూడండి. ఇకపై కేకును బయట కొనడమే మానేస్తారు. దీన్ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఓవెన్ ఉన్నా లేకపోయినా కేకు రెడీ అయిపోతుంది.
బిస్కెట్లతో చేసే కేకు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బిస్కెట్లు - 200 గ్రాములు
పాలు - పావు లీటరు
బేకింగ్ సోడా - అర స్పూను
వెనిల్లా ఎసెన్స్ - పావు స్పూను
నూనె లేదా బటర్ - రెండు స్పూన్లు
బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్
చాక్లెట్లు - రెండు
జీడిపప్పు తరుగు - ఒక స్పూను
బాదం తరుగు - ఒక స్పూను
పిస్తా తరుగు - ఒక స్పూను
బిస్కెట్లతో కేక్ రెసిపీ
1. కేకును తయారుచేసేందుకు మీకు నచ్చిన బిస్కెట్లను ఎంచుకోవచ్చు.
2. మీకు చాక్లెట్ కేక్ కావాలనిపిస్తే చాక్లెట్లు ఫిల్ చేసి ఉండే బిస్కెట్లను తీసుకోండి. లేదా సాధారణ బిస్కెట్లను కూడా ఎంచుకోవచ్చు.
3. బిస్కెట్లు ఏవైనా కేక్ చేసే పద్ధతి మాత్రం ఒకటే.
4. ముందుగా మీరు ఎంచుకున్న బిస్కెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
5. ఒక గిన్నెలో ఆ పొడిని వేసుకోవాలి.
6. ఆ పొడిలోనే కాచి చల్లార్చిన పాలు, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, నూనె లేదా బటర్ వేసి బాగా కలపాలి.
7. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా చూసుకోవాలి.
8. ఇప్పుడు కేక్ టిన్‌ను తీసుకొని అడుగు భాగాన నెయ్యి పోయాలి.
9. వరిపిండి లేదా గోధుమ పిండిని ఆ నెయ్యి పై ఒక అర స్పూను చల్లాలి.
10. దీనివల్ల కేకు అడుగుభాగానికి అంటుకుపోకుండా ఉంటుంది.
11. ఇప్పుడు ఈ బిస్కెట్ల మిశ్రమాన్ని అందులో వేసి గాలి బుడగలు లేకుండా నేలకి గిన్నెతో సహా తట్టాలి.
12. ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేయాలి. తర్వాత ఈ కేక్ టిన్‌ను లోపల ఉంచి 20 నిమిషాల పాటు బేక్ చేయాలి.
13. కేక్ తయారైందో లేదో తెలుసుకోవడం కోసం టూత్ పిక్ తో కేక్ పై గుచ్చాలి. దాన్ని బయటకు తీస్తే ఎలాంటి పిండి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. టూత్ పిక్ ఇంట్లో లేకపోతే ఫోర్కును వాడొచ్చు.
14. ఇప్పుడు బాగా మరగ కాచిన వేడి పాలలో చాక్లెట్లు వేయాలి. చాక్లెట్లు కరుగుతాయి.
15. కేకు పై ఆ చాక్లెట్ ద్రావకాన్ని వేసి పైన చాకో ఫిల్స్, నట్స్ వంటి వాటిని చల్లుకుంటే కేక్ రెడీ అయిపోతుంది.
16. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
17. మీకు కూల్ కేక్ కావాలనిపిస్తే ఈ కేకును రెండు నుంచి మూడు లేయర్లుగా కట్ చేసి పంచదార నీళ్లను వేయాలి.
18. ఆ పంచదార నీరుని పీల్చుకున్న కేకు మెత్తగా అవుతుంది. మళ్లీ కేకు లేయర్లను యధావిధిగా పెట్టేయాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో ఉంచితే కూల్ కేక్ రెడీ అయినట్టే.
ఓవెన్ లేకపోతే...
ఇంట్లో ఓవెన్ లేనివారు పెద్ద గిన్నెలో అడుగున ఇసుక లేదా ఉప్పును వేసి పైన మూత పెట్టి ఆ గిన్నెను ప్రీ హీట్ చేయాలి. లేదా పెద్ద గిన్నెలో చిన్న స్టాండ్ పెట్టి పైన మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో ఈ కేకు టిన్నును స్టాండ్ మీద పెట్టి తిరిగి మూత పెట్టేయాలి. ఒక అరగంట సేపు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. కేకు ఉడికిందో లేదో టూత్ పిక్ తో గుచ్చి తెలుసుకోవచ్చు. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల్లో కేకు రెడీ అయిపోతుంది.