Baking Tips: బేకింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. కేకులు, కుకీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి..-know few tips to follow while baking for perfect baking ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baking Tips: బేకింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. కేకులు, కుకీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి..

Baking Tips: బేకింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. కేకులు, కుకీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి..

HT Telugu Desk HT Telugu

Baking Tips: కొత్తవాళ్లయినా, పాత వాళ్లయినా బేకింగ్ చేస్తుంటే కొన్ని పొరపాట్లు చేసేస్తుంటారు. దానివల్ల అనుకున్న స్థాయిలో కేకులు, కుక్కీలు రుచిగా రావు. ఆ తప్పులేంటో తెల్సుకుంటే పర్ఫెక్ట్ బేకింగ్ చేసేయొచ్చు.

బేకింగ్ టిప్స్ (pexels)

బేకింగ్‌ అనేది ఓ కళే. వంట బాగా చేయగలిగిన వారంతా బేకింగ్‌ బాగా చేయగలుగుతారు అనడానికి ఏమీ లేదు. పదార్థాలను సరైన పాళ్లలో కలపక పోయినా, తగినంత ఉష్ణోగ్రతను సెట్‌ చేయకపోయినా బిస్కెట్లు, కేకుల్లాంటివి సరిగ్గా పొంగవు. ఒక్కోసారి లోపల సరిగ్గా బేక్‌ కావు.

మరోసారి అనుకున్న దాని కంటే ఎక్కువగా బేక్‌ అయి గట్టిబడిపోతాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు బేకింగ్‌లో ఉంటాయి. అయితే కేకులు, మఫీన్లు, బిస్కెట్ల లాంటివి ఎప్పుడు చేసినా మంచిగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి.

బేకింగ్‌ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్:

1. బేకింగ్‌ చేసేందుకు ప్రతిసారీ పదార్థాలన్నింటినీ జాగ్రత్తగా కలపాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఊరికే చేతి కొలతతో దేన్నీ వేయకండి. ఏది ఎంత వేయాలి? అనేదానికి కచ్చితంగా లెక్క ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరించే ప్రయత్నం చేయండి.

2. బేకింగ్‌లో గుడ్లు, పిండి, పంచదార పొడి లాంటి వాటిని సాధారణంగా వాడుతూ ఉంటారు. ఇలాంటి ఏ పదార్థాలైనా సరే ఫ్రిజ్‌లో నుంచి తీసి వెంటనే వాటిని కలపకూడదు. అవన్నీ కచ్చితంగా గది ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా చల్లగా ఉన్న గుడ్లలాంటి వాటిని వాడటం వల్ల ఫలితం ఊహించిన రీతిలో పర్ఫెక్ట్‌గా రాదు.

3. బేకింగ్‌ మీద ఎక్కువగా ఆసక్తి ఉన్న వారు కచ్చితంగా బీటర్‌, మిక్సర్లను వాడాలి. చేతితో ఎంత కలిపినా అందులో వచ్చిన టెక్స్చర్‌ రానే రాదు. ఎలక్ట్రిక్‌ బీటర్‌తో బీట్‌ చేసినప్పుడు మాత్రమే గుడ్డు సొన లాంటివి ఫోమ్‌ మాదిరిగా వస్తాయి. అలాగే విప్పింగ్‌ క్రీం లాంటివి కూడా చేతితో ఎంత చేసినా సరిగ్గా రావు. కాబట్టి బేకింగ్‌ ఎక్కువగా చేస్తూ ఉంటాం అనుకునే వారంతా సామగ్రిని కొనుగోలు చేసుకుని పెట్టుకోవాలి.

4. బేక్‌ చేయాలనుకునే ప్రతి సారీ ఒవెన్‌ని కచ్చితంగా ప్రీహీట్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఒవెన్‌లో మాత్రమే అప్పటికప్పుడు తయారు చేసిన పిండి ట్రేను పెట్టుకోవాలి. పిండి మిక్స్‌ చేసిన తర్వాత ఎక్కువ సేపు అలా నిల్వ ఉంచకూడదు. అందులో ఉన్న ఎయిర్‌ బబుల్స్‌ అన్నీ పోయి అది చతికిలబడి పోయినట్లుగా అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని బేక్‌ చేస్తే అది సరిగ్గా పొంగకుండా గట్టిగా ఉంటుంది.

5. పిండిలో కలుపుకునే అన్ని పదార్థాలు ఉండేలా చూసుకోండి. ఏదైనా ఒక పదార్థం లేకపోతే దానికి బదులుగా ఇంకోటి వేసేసి పని కానిచ్చేయడానికి చూడకండి. ఎందుకంటే బేకింగ్ అనేది ఒక రకమైన కెమిస్ట్రీ. ఆయా పదార్థాలన్నీ తగు మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే అది చివరికి విజయవంతం అవుతుంది.