Egg Lollipop: పిల్లలకు ఎగ్ లాలీపాప్ చేసి పెట్టండి, ఎన్నయినా తింటారు
Egg Lollipop: గుడ్డుతో చేసే లాలీపాప్ సాయంత్రం పూట పిల్లలకు నచ్చే స్నాక్ రెసిపీ. గుడ్డునే కాస్త మార్చి చేసే ఈ రుచికరమైన ఎగ్ లాలీపాప్ తయారీ ఎలాగో చూడండి.
ఎగ్ లాలీపాప్ రెసిపీ
గుడ్డు ఇష్టంగా తినేలా రకరకాల స్నాక్స్ ట్రై చేయొచ్చు. ఈ ఎగ్ లాలీపాప్ కూడా అలాంటి రెసిపీయే. పిల్లల బర్త్‌డేలు, చిన్న పార్టీలకు ఫ్యాన్సీ స్నాక్ లాగా కనిపిస్తాయివి. వాటి రెసిపీ చూసేయండి.
ఎగ్ లాలీపాప్ తయారీకి కావాల్సినవి:
ఈ కొలతలన్నీ 6 గుడ్లకు సరిపోతాయి. మీ అవసరాన్ని బట్టి మార్చుకోండి.
6 గుడ్లు, ఉడికించి పెంకు తీసుకోండి
1 కప్పు మైదా
3 చెంచాల శనగపిండి
అరచెంచా కారం
అరచెంచా పసుపు
ఒక టీస్పూన్ మిరియాల పొడి
అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
1 ఉల్లిపాయ సన్నటి ముక్కల తరుగు
1 క్యాప్సికం, తరుగు
కాస్త కొత్తిమీర తరుగు
ఎగ్ లాలీపాప్ తయారీ విధానం:
- ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదా, శనగపిండి వేసుకోండి.
- కారం, పసుపు, ఉప్పు, పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒకసారి కలపండి. ఈ పిండిని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక బౌల్ లో గుడ్లను సన్నటి ముక్కలు లేదా తురుముకుని వేసుకోండి. అందులో ఉప్పు, పసుపు, కారం, మిరియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు,క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసి ముద్దలాగా కలుపుకోండి.
- అంతా కలిసి ముద్ద అయ్యాక చిన్న చిన్న బాల్స్ చేసుకోండి.
- ఈ బాల్స్ ముందుగా రెడీ చేసుకున్న పిండి మిశ్రమంలో ముంచండి.
- కడాయి పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఈ బాల్స్ వేసి ఎర్రగా వేయించండి.
- వీటికి టూత్ పిక్ గుచ్చి సర్వ్ చేస్తే ఎగ్ లాలీపాప్ రెడీ.
- ఇలా కాకుండా ఐస్ క్రీం పుల్లలకు గుడ్డు మిశ్రమాన్ని ముందుగానే గుండ్రంగా పెట్టి దాన్ని పిండిలో ముంచి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
- వీటిని టమాటా సాస్‌తో సర్వ్ చేయండి.
టాపిక్