Millets for diabetes: షుగర్ ఉన్నవాళ్లు తప్పకుండా తినాల్సిన చిరుధాన్యాలివే..
Millets for diabetes: మధుమేహులకు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవేంటో తెలుసుకోండి.
మధుమేహంతో బాధపడుతున్నవారికి మిల్లెట్స్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా నిర్ణయించారు. దాంతో వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. వీటిలో ఉండే అధిక పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి మధుమేహం స్థాయుల్ని నియంత్రణలో ఉంచుతాయి. బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. క్రమం తప్పకుండా చిరుధాన్యాలు చేర్చుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే కొన్ని ముఖ్య చిరుధాన్యాల గురించి తెలుసుకోండి.
1. కొర్రలు (Foxtail Millet):
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నవాళ్లకు కొర్రలు ఉత్తమ ఆహారం. ఇవి రక్తంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్లను తగ్గిస్తాయి. గోధుమలు, బియ్యానికి బదులు కొర్రలతో చేసిన ఆహారం తినడం మేలు చేస్తుంది. చక్కెర స్థాయుల్ని ఇవి తగ్గిస్తాయి.
2. జొన్నలు (Jowar):
ఇది రక్తంలో చక్కెర స్థాయుల్ని ఒకేసారి పెరగకుండా చేస్తుంది. వీటిలో అధిక పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. బరువు తగ్గేలా సాయపడతాయి.
3. ఊదలు (Barnyard Millet):
వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. మెల్లగా జీర్ణమవుతాయి. అందుకే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకి ఇవి చాలా ఉత్తమం.
4. రాగులు (Finger Millet):
వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇతర చిరుధాన్యాలు, తృణ ధాన్యాల్లో కన్నా ఈ రాగుల్లో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. పీచు, మినరళ్లు, అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రణలో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయుల్ని కూడా తగ్గిస్తాయి.
5. సజ్జలు (Pearl Millet):
ఈ చిరుధాన్యం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. ట్రై గ్లిజరాయిడ్ల స్థాయుల్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. వేరే ఆహారాలతో పోలిస్తే ఇవి మెల్లగా జీర్ణమవుతాయి. గ్లుకోజ్‌ను రక్తంలోకి మెల్లగా విడుదల అయ్యేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండేలా చేస్తాయివి.