Ear Pain Home Remedies । చెవినొప్పి బాధిస్తే.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!-ear infections causes treatment details and home remedies to ease pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ear Pain Home Remedies । చెవినొప్పి బాధిస్తే.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Ear Pain Home Remedies । చెవినొప్పి బాధిస్తే.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

HT Telugu Desk HT Telugu
Jun 09, 2023 11:22 AM IST

Ear Pain Home Remedies: చెవి ఇన్ఫెక్షన్లు తరచుగా వాటంతట అవే తగ్గిపోతాయి, చెవినొప్పి తగ్గించడానికి ఇంట్లోనే మీరు ప్రయత్నించగల కొన్ని రెమెడీలు ఇక్కడ తెలుసుకోండి.

Ear Pain Home Remedies:
Ear Pain Home Remedies: (istock)

Ear Pain Home Remedies: చెవి వద్ద ఏదైనా దోమలాంటి గుయ్యుమని శబ్దం చేస్తేనే మనం ఇబ్బందిపడతాం, అలాంటిది మనకు చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగి అది నొప్పిని కలిగిస్తే భరించగలమా? సాధారణంగా చెవి ఇన్ఫెక్షన్‌లు పిల్లల్లో ఎక్కువగా వస్తాయి, అయితే పెద్దలు కూడా ఎప్పుడో ఒకసారి చెవి ఇన్ఫెక్షన్లతో బాధపడతారు. చెవినొప్పి లేదా చెవిపోటు అనేది వివిధ కారణాల వల్ల వస్తుంది. చెవినొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మనం పనులు చేసుకోవడానికి ఇబ్బందిపడతాం, వినికిడి సమస్య ఉంటుంది. చెవిపోటు ఉన్నవైపు ఆహారాన్ని నమలడానికి కూడా కష్టంగా ఉంటుంది. చెవిపోటుతో తలనొప్పి, మెడ, దవడల నొప్పి కలగడం, టాన్సిల్స్ రావడం కూడా జరుగుతుంది.

చెవి ఇన్ఫెక్షన్లు (ear infections) తరచుగా వాటంతట అవే తగ్గిపోతాయి, వైద్య సహాయం అవసరం లేదు. అయితే చెవినొప్పి మిమ్మల్ని చాలా అసౌకర్యానికి గురిచేయవచ్చు. చెవి నొప్పిని తగ్గించడానికి ఇంట్లోనే మీరు ప్రయత్నించగల కొన్ని రెమెడీలు ఇక్కడ తెలుసుకోండి.

కోల్డ్ - వార్మ్ కంప్రెస్

చెవి నొప్పి నుండి ఉపశమనానికి చల్లని లేదా వెచ్చని కంప్రెస్ (Cold or Warm Compress) గొప్పగా పనిచేస్తుంది. ఒక శుభ్రమైన గుడ్డను చల్లటి లేదా వేడి నీటిలో తడిపి, ఆపై మీకు నొప్పి ఉన్నచోట ఉంచండి, ఈ చిట్కాతో మీ నొప్పి చాలా వరకు తగ్గుతుంది. గుడ్డతో ఎక్కువగా ప్రయోజనం లేదనిపిస్తే మీరు హీటింగ్ ప్యాడ్ లేదా కూలింగ్ ప్యాడ్ ఉపయోగించవచ్చు.

చ్యూయింగ్ గమ్ నమలండి

చెవినొప్పి తగ్గటానికి మీరు చ్యూయింగ్ గమ్ నమలవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా? విమానంలో ప్రయాణించేటపుడు లేదా ఎక్కువ ఎత్తులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాలి పీడనంలో కలిగే మార్పుల వలన చెవిలో నొప్పి అనిపిస్తుంది. ఈ సందర్భంలో చ్యూయింగ్ గమ్ (Chewing Gum) తినాల్సిందిగా సూచిస్తారు, ఇదే చిట్కాను మీరు ఇంట్లో కూడా ఉపయోగించవచ్చు.

నిటారుగా నిద్రించండి

మీ తల కొద్దిగా ఎత్తుగా ఉండేలా నిద్రించండి. పడుకునేటపుడు మీ తలకింద రెండుమూడు తలగడలను అమర్చుకోవడం లేదా మీ మంచంను ఏటవాలుగా చేసి పడుకోవడం (Inclined Sleeping) లేదా కొంచెం వాలుగా ఉండే రిక్లైనింగ్ కుర్చీలో పడుకోవడం వలన చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా పడుకున్నప్పుడు మీ చెవిలో ద్రవం హరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మీ చెవిలో ఒత్తిడి, నొప్పిని తగ్గించగలదు.

చెవి చుక్కలు వేసుకోండి

అలాగే నొప్పి నివారణ కోసం చెవిలో వేసే చుక్కలను ఉపయోగించవచ్చు. మీ సమస్యను బట్టి ఫార్మసీ నిపుణులు మీకు సరైన చెవి చుక్కలు (ear drops) అందిస్తారు. వీటితో మీకు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీ కర్ణభేరికి చీలిక లేదా రంధ్రం లేదా గాయం లాంటిది ఏర్పడితే మీరు ఇయర్ డ్రాప్స్ ఉపయోగించకూడదు, దీనికి వైద్య నిపుణుడి సహాయం అవసరం అవుతుంది.

నొప్పి నివారణ ఔషధాలు

ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ లేదా నాప్రోక్సెన్ వంటి ఔషధాలు తరచుగా చెవి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సూచిస్తారు, మీకు ఏది సరైనదదో నిపుణులను సంప్రదించాలి.

ఈ చిట్కాలతో మీ చెవినొప్పికి 2 లేదా 3 రోజులలో పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ మీకు ఎంతకీ చెవినొప్పి తగ్గకపోవడం, చెవినొప్పి చాలా తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మీ చెవి నుండి చీము లేదా రక్తం కారటం, అధిక జ్వరం, తలనొప్పి లేదా మైకము ఉన్నప్పుడు లేదా చెవినొప్పితో ఆ భాగంలో వాపు రావడం వంటి లక్షణాలను గమనిస్తే, అది ఇంటి చిట్కాలతో నయమయ్యే పరిస్థితి కాదు. వైద్యుడిని సంప్రదించి చికిత్స తప్పకుండా తీసుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం