Inclined Sleeping । ఏటవాలు కోణంలో నిద్రిస్తే ఎలాంటి మార్పులుంటాయో తెలుసా?-inclined sleeping position can improve certain health conditions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Inclined Sleeping Position Can Improve Certain Health Conditions

Inclined Sleeping । ఏటవాలు కోణంలో నిద్రిస్తే ఎలాంటి మార్పులుంటాయో తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 09, 2022 10:38 PM IST

పడకను కొన్ని డిగ్రీలు ఎత్తి ఏటవాలు కోణంలో నిద్రిస్తే కొన్ని మార్పులను గమనించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Inclined Sleeping
Inclined Sleeping (Unsplash)

మనం నిద్రపోయే తలాన్ని కొంచెం ఏటవాలుగా మార్చుకుంటే ఆరోగ్యపరంగా కొన్ని మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు సూచించాయి. దీనిని ఇన్‌క్లైన్డ్ థెరపీ అంటారు. మనం నిద్రించేటపుడు తల ఉంచే వైపును కొద్దిగా పైకి లేపాలి, దీంతో కాళ్లు కిందివైపుకు ఉంటాయి. ఇలా ఏటవాలు కోణంలో నిద్రించటానికి అనుమతించేలా కొన్ని మంచాల్లో సౌకర్యం ఉంటుంది. అలాంటి మంచాలు లేనినపుడు మన పడకని తలపెట్టే వైపు కొద్దిగా ఎత్తులో ఉండేలా సర్దుబాటు చేసుకోవచ్చు.

అయితే ఈ తరహాలో నిద్రించడం వలన నిద్రపై మంచి ప్రభావాలు ఉంటాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం 'ఇన్‌క్లైన్డ్ స్లీపింగ్' ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి..

మెరుగైన శ్వాస 

ఏటవాలుగా పడుకోవడం ద్వారా తలభాగం ఎత్తులో ఉంటుంది. ఈ విధానంలో మెరుగైన శ్వాస లభిస్తుంది. శ్వాస సంబంధ ఇబ్బందులు ఉన్నవారు ఈ రకంగా పడుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు. అలాగే శ్వాస నిండుగా ఉంటుంది కాబట్టి గురక సమస్యలు తీరిపోతాయి.

ఆక్సిజన్ సంతృప్తత

మెరుగైన శ్వాస ఉంటుంది కాబట్టి శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. ఫ్లాట్ బెడ్‌పై పడుకునే వారితో పోలిస్తే 30⁠–45 డిగ్రీల కోణంలో నిద్రపోయేవారిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటమే కాకుండా ఆక్సిజన్ సంతృప్తతలో గణనీయమైన వృద్ధి కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు.

అసిడ్ రిఫ్లక్స్ నివారణ

రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతమందికి ఛాతీలో మంట, కడుపు ఉబ్బసం, గ్యాస్ తదితర జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి సందర్భంలో పడకను తలపెట్టేవైపు 20 సెంటీమీటర్లు పెంచడం ద్వారా ఆసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించవచ్చు.

మెరుగైన రక్తప్రసరణ

ఫ్లాట్‌గా పడుకోవటంతో పోలిస్తే 30 డిగ్రీల ఎగువ కోణంలో నిద్రిస్తే గుండెకు రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని నిర్ధారణ అయింది. హృదయస్పందన రేటు మెరుగ్గా ఉండాలంటే ఈ కోణంలో నిద్రించాలని సూచిస్తున్నారు. అలాగే ఈ తరహాలో నిద్రించడం వెంటిలేటర్లో ఉన్నవారికి కూడా సహాయకారిగా ఉంటుంది. అయితే ఈ సందర్భాలలో వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలని సిఫారసు చేస్తున్నారు.

మొత్తంగా ఏటవాలు పడకపై నిద్రించడం వలన ఇలాంటి కొన్ని సమస్యలను నివారించవచ్చు. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది, నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నపిల్లలకు మాత్రం ఈ తరహా విధానంలో నిద్ర కల్పించవద్దు. వారికి శ్వాస ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే వదులుగా ఉండే పరుపులు, మృదువైన వస్తువులు, బొమ్మలు లేదా దిండ్లను ఉపయోగించి ఈ రకమైన ప్రయోగాలు చేస్తే కండరాలు పట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్