Earache Remedies | చ్యూయింగ్ గమ్‌తో చెవిపోటు మాయం.. -get rid off earache with chewing gum here is how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Earache Remedies | చ్యూయింగ్ గమ్‌తో చెవిపోటు మాయం..

Earache Remedies | చ్యూయింగ్ గమ్‌తో చెవిపోటు మాయం..

Manda Vikas HT Telugu
Mar 02, 2022 02:16 PM IST

చెవిపోటు కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. చెవిలోకి ఏదైనా కీటకం లాంటిది దూరినపుడు, గులిమి ఎక్కువైనపుడు, ఎలర్జీ లేదా ఏవైనా ఇన్ఫెక్షన్ల కారణంగా చీము పడితే చెవిలో నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు విమానంలో ప్రయాణించేటపుడు కూడా గాలిపీడనంలో హెచ్చుతగ్గుల కారణంగా చెవిపోటు సంభవిస్తుంది.

చెవిపోటు - Ear Pain
చెవిపోటు - Ear Pain (Shutterstock)

చెవి దగ్గర చిన్న దోమ శబ్దం చేసినా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది చెవి లోపల ఏదైనా ఇబ్బంది ఏర్పడి నొప్పి కలిగితే ఆ బాధను భరించలేము. చెవిపోటు చాలా సాధారణమైన సమస్య, ఇది ఎక్కువగా పిల్లలకు కలుగుతుంది. పెద్దవారిలో అరుదుగా సంభవిస్తుంది.

చెవిపోటు కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. చెవిలోకి ఏదైనా కీటకం లాంటిది దూరినపుడు, చెవిలో జివిలి (గులిమి) ఎక్కువైనపుడు, ఎలర్జీ లేదా ఏవైనా ఇన్ఫెక్షన్ల కారణంగా చీము పడితే చెవిలో నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు విమానంలో ప్రయాణించేటపుడు కూడా గాలిపీడనంలో హెచ్చుతగ్గుల కారణంగా చెవిపోటు సంభవిస్తుంది.

మీకు తెలుసా.. చ్యూయింగ్ గమ్ నమిలితే చెవిపోటు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. పైన చెప్పినట్లుగా విమానాల్లో ప్రయాణించేటపుడు కింద భూఉపరితలం మారితే ముఖ్యంగా సముద్రాలు, పర్వతాల మీదుగా ప్రయాణిస్తున్నపుడు వచ్చే ఒక విధమైన శబ్దం చెవిని పట్టేసినట్లుగా అనిపిస్తుంది. అలాంటపుడు మీరు గమనిస్తే కొంతమంది చ్యూయింగ్ గమ్ నమలడం లాంటిది చేస్తారు.

చ్యూయింగ్ గమ్ నములుతున్నప్పుడు దవడల్లో నిరంతరాయమైన కదలిక ఉంటుంది. ఈ కదలికలు గాలిపీడనంలో అసమతుల్యత ఏర్పడినపుడు చెవి అంరత్గత భాగంలో కలిగే ఒత్తిడిని నియంత్రిస్తాయి. కాబట్టి ఈ సమయంలో చ్యూయింగ్ గమ్ నములుతూ ఉంటే చెవి నొప్పి బాధించదు. ఈసారి మీరు విమానాల్లో ప్రయాణించేటపుడు ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి.

ఇక మిగతా సమయాల్లో చెవినొప్పి బాధిస్తున్నపుడు తక్షణ ఉపశమనం కోసం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి నొప్పి తగ్గించుకోవచ్చు. అవేంటో చూడండి..

చెవినొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం పాటించాల్సిన నివారణ మార్గాలు:

చలి-వేడి పద్ధతి

ఏ రకం నొప్పినైనా తగ్గించటానికి ఉపయోగించే చాలా సులభమైన పద్ధతి ఇది. ఈ చిట్కా చెవిపోటుకు కూడా పనిచేస్తుంది. చెవిపోటు బాధిస్తున్నప్పుడు ఒక శుభ్రమైన కాటన్ గుడ్డను కొద్దిగా వేడిచేసి దానిని వెచ్చదనాన్ని చెవి వద్ద అదిమి పట్టాలి. ఇది నొప్పినుంచి హాయిగొలిపే అనుభూతిని కలిగిస్తుంది. ఇదే పద్ధతిలో ఒక పది నిమిషాల తర్వాత చల్లటి ఐస్ బ్యాగ్ ను చివి వద్ద ఉంచాలి. ఇలా చల్లదనం, వెచ్చదనం రెండూ అనుభూతులు కలిగించడం ద్వారా చెవినొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అల్లం

అల్లంలోని యాంటీమైక్రోబియల్ ఔషధ గుణాలు చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లంను బాగా దంచి దాని నుంచి వచ్చే రసాన్ని కొద్దిగా వేడిచేసి చెవినొప్పి ఉన్నచోట రుద్దాలి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఈ రసాన్ని చెవి లోపల వేయకూడదు. బదులుగా పచ్చి అల్లంను నేరుగా నమిలితే కూడా ప్రయోజనం ఉంటుంది.

వెల్లుల్లి రసం

వెల్లుల్లి రసం కూడా చెవిపోటుకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసాన్ని రెండు, మూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చాలు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదా వెల్లుల్లిని దంచి ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో వేడి చేసి ఆ మిశ్రమాన్ని చెవినొప్పి ఉన్నచోట మర్ధన చేయాలి.

ఆలివ్/ బాదాం నూనె

ఆలివ్ ఆయిల్ చెవి నొప్పికి అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. నొప్పిని నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చెవి నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు చెవిలో 2 చుక్కల గోరు వెచ్చని ఆలివ్ నూనెను వేస్తే, తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆలివ్ ఆయిల్ లేనప్పుడు బాదాం నూనెను ఉపయోగించవచ్చు.

నిద్ర భంగిమలో మార్పు

చెవిపోటు ఉన్నప్పుడు మీ నిద్రపోయే భంగిమను మార్చుకుంటే చెవినొప్పి కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. నొప్పి వేధిస్తున్నపుడు చెవిపై ఒత్తిడి పడేలా ఒక పక్కగా పడుకోవద్దు. ఎల్లప్పుడు వెల్లకిలా, రెండు చెవులపై ఎలాంటి ఒత్తిడి లేనట్లుగా పడుకోవాలి. ఇలా చేస్తే మార్పు మీకే తెలుస్తుంది.

చివరగా చెప్పేదేమిటంటే.. పైన పేర్కొన్నవన్నీ చెవిపోటు నుంచి తక్షణ ఉపశమనం కోసం అందించిన కొన్ని నివారణ మార్గాలు మాత్రమే. నొప్పి కొనసాగితే మాత్రం వైద్యుడిని సంప్రదించి, అందుకు కారణమేంటో తెలుసుకొని సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

WhatsApp channel