Improve Hearing | వింటున్నారా? వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు మారాలి!
Improve Hearing: వినికిడి లోపం తలెత్తడానికి అనేక కారణాలున్నాయి. అయితే వినికిడి లోపం లేదా చెవుడుకు సంబంధించి చాలా వరకు కేసులను నయం చేయవచ్చునని డాక్టర్లు అంటున్నారు, అందుకు మీరు ఏం చేయాలో తెలుసుకోండి.
Improve Hearing: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కానీ, ఇంద్రియాలలో ప్రతీ ఒక్కటి ప్రధానమే. చూడటానికి కళ్లు ఎంత ముఖ్యమో, వినడానికి చెవులు అంతే ముఖ్యం. వినికిడి లోపం వలన చాలా సమస్యలు ఉంటాయి. చాలా మంది వ్యక్తులు వారి వినికిడిపై శ్రద్ధ చూపకపోవచ్చు, కానీ ఏదైనా చర్యకు ప్రతిస్పందించడానికి, నేర్చుకోవడానికి, ఇతరులతో సమర్థవంతంగా సంభాషణలను ఆస్వాదించడానికి, ప్రకృతితో అనుసంధానం కావడానికి వినికిడి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంగీతం వినాలన్నా, సినిమాలను అర్థవంతంగా వీక్షించాలన్నా, వినోదాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలన్నా లేదా ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నా మీ చెవులకు వినే శక్తి ఉండాలి. వినికిడి అనేది అభిజ్ఞా పనితీరు, మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉందని అనేక అధ్యయనాలు సూచించాయి.
వినికిడి లోపం తలెత్తడానికి అనేక కారణాలున్నాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్ది వినికిడి సమస్యలు వస్తాయి. దీనితో పాటు భారీ శబ్దాలు వినడం, జన్యు సమస్యలు, అనారోగ్య సమస్యలు, నాడీ సంబంధిత రుగ్మతలు, కొన్ని రకాల ఔషధాలు, గాయాలు మొదలైనవి వినికిడి లోపానికి దారితీయవచ్చు. అయితే వినికిడి లోపం లేదా చెవుడుకు సంబంధించి చాలా వరకు కేసులను నయం చేయవచ్చునని ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో ENT కన్సల్టెంట్, డాక్టర్ నితిన్ శర్మ తెలిపారు. మెరుగైన వినికిడి శక్తి కోసం డాక్టర్ శర్మ కొన్ని జీవనశైలి మార్పులను సూచించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
సరైన పోషణ
B12 అధికంగా ఉన్న ఆహారం తినడం ద్వారా వినికిడి సంబంధిత పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము , కాల్షియం అధికంగా తీసుకోవడం . విటమిన్ డి, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన చెవుడు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
తేలికపాటి వ్యాయామం
వ్యాయామం అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించి, శక్తి స్థాయిలను మెరుగుపరచడమే కాకుండా, వయస్సు-సంబంధిత వినికిడి లోపం నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, అతిగా వ్యాయామం అవసరం లేదు, మితమైన వ్యాయామం చాలు.
ధూమపానం మానుకోండి
అధ్యయనాల ప్రకారం, ధూమపానం చేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ పొగ కూడా వినికిడి లోపంను కలిగిస్తుంది కాబట్టి సిగరెట్లకు, సిగరెట్ తాగే వారికి దూరంగా ఉండాలి.
తగినంత నిద్ర
నిద్ర లేకపోవడం శారీరక, మానసిక ఆరోగ్యంను దెబ్బతీస్తుంది. ఇందులో వినికిడి లోపం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రికి తగినంత నిద్ర తీసుకోండి.
పెద్ద శబ్దాలను నివారించండి
పెద్దపెద్ద శబ్దాలను వినడం వలన మీ చెవిలోని కర్ణభేరి దెబ్బతింటుంది, చెవుడు వస్తుంది. కొంతమంది గంటల తరబడి చెవులకు హెడ్‌ఫోన్‌లు ధరించి పెద్ద శబ్దంతో సంగీతం వింటారు, ఇది వినికిడి లోపానికి దారితీస్తుంది. నిర్మాణాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు, త్రావ్వకాలు, మైన్స్ ఉన్నచోట ఉండటం, తరచుగా నైట్‌క్లబ్‌లు, లౌడ్ స్పీకర్లు వంటి పెద్ద శబ్దం ఉన్న వాతావరణంలో ఉండటం వలన వినికిడి సమస్యలు వస్తాయి.
వినికిడి పరీక్షలు
కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఆడియాలజిస్ట్‌ని సంప్రదించి, వినికిడి పరీక్షను చేయించుకోవడం చాలా ముఖ్యం. వినికిడి లోపం లేదా శాశ్వతంగా చెవుడు రాకముందే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ చెవులు సేఫ్.
సంబంధిత కథనం