Blood Donation: ఆరు నెలలకోసారి రక్త దానం చేయండి, అది మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది-donating blood every six months is also very good for your health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Donation: ఆరు నెలలకోసారి రక్త దానం చేయండి, అది మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది

Blood Donation: ఆరు నెలలకోసారి రక్త దానం చేయండి, అది మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది

Haritha Chappa HT Telugu
Jun 15, 2024 10:30 AM IST

Blood Donation: రక్తాన్ని దానం చేస్తే తమ ఆరోగ్యం పాడవుతుందని ఎక్కువ మంది అనుకుంటారు. తాము నీరసంగా మారతామని భావిస్తారు. నిజానికి రక్త దానం చేయడం వల్ల మన శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండెను కూడా రక్షిస్తుంది.

రక్త దానం చేస్తే లాభాలు
రక్త దానం చేస్తే లాభాలు (pexels)

రక్తదానం చేయడం ఒక గొప్ప పని. అయితే రక్త దానం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని, రక్తం తగ్గి నీరసంగా మారిపోతామని ఎంతో మంది భావిస్తారు. దీని వల్ల అత్యవసర సమయంలో కూడా రక్త దానం చేయకుండా వెనక్కి తగ్గుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది… రక్త దానం చేయడం వల్ల ఎదుటి వారికి ప్రాణాలు పోయడమే కాదు, మీకున్న కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రక్త దానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తదానం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకోసమే ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్త దాతల దినోత్సవం నిర్వహించుకుంటారు. రక్తదానం చేయడం వల్ల రక్తదానం చేసే వ్యక్తికి, అలాగే స్వీకరించే వ్యక్తికి సహాయపడుతుంది. ప్రతి వ్యక్తి ఆరు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. పూర్తి ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు నెలల కోసారి కూడా రక్త దానం చేయవచ్చని వైద్యులు చెబుతారు. రక్తదానం చేసిన వ్యక్తికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యానికి

రక్తదానం చేయడం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తదానం చేయడం రక్త ప్రవాహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇనుము నిల్వలు

రక్తంలో అధిక ఇనుము పేరుకుపోతే హిమోక్రోమాటోసిస్కు అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండె, కాలేయం వంటి అవయవాలకు నష్టం కలిగిస్తుంది. మనం క్రమం తప్పకుండా రక్తదానం చేసినప్పుడు, అదనపు ఇనుము తగ్గుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

కొత్త రక్త కణాల ఉత్పత్తి

రక్తదానం చేసిన తరువాత, తిరిగి రక్తాన్ని భర్తీ చేయడానికి శరీరం పనిచేస్తుంది. ఇది కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి, పనులను సమర్థవంతంగా చేయడానికి శరీర సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

ఉచిత హెల్త్ స్క్రీనింగ్

రక్తదానం చేయడానికి ముందు, పల్స్, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్ స్థాయిలతో సహా ప్రాథమిక ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇది మన శరీరం గురించి మరింత తెలుసుకోవడానికి, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే పరిష్కరించడానికి సహాయపడుతుంది.

మానసిక శ్రేయస్సు కోసం

మనం దానం చేసిన రక్తం ఒకరి జీవితాన్ని కాపాడగలదు. ఆ విషయం మన మెదడుకు అర్థం అవుతుంది. అది మానసికంగా ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. కాబట్టి ఆనంద హార్మోన్లు విడుదల అవుతాయి.

Whats_app_banner