Neck & Shoulder Pain | లేవగానే మెడ, భుజాలు నొప్పిగా అనిపిస్తే.. ఇలా చేయండి!
ఉదయం నిద్రలేచిన తర్వాత మెడ కండరాలు, భుజాలు పట్టేసినట్లుగా అనిపిస్తుందా? మెడను తిప్పలేకపోతున్నారా? అయితే సులభంగా పూర్వస్థితికి తెచ్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి. అవి ఇక్కడ తెలుసుకోండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత మెడ కండరాలు, భుజాలు పట్టేసినట్లుగా అనిపిస్తుందా? మెడను తిప్పలేకపోతున్నారా? అయితే సులభంగా పూర్వస్థితికి తెచ్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి. అవి ఇక్కడ తెలుసుకోండి.
నిద్రలేచిన తర్వాత మీకు మెడ పెట్టేసినట్లు లేదా భుజాలలో నొప్పి ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కారణం మీరు నిద్రపోయిన భంగిమ సరిగా లేకపోవటమే. రాత్రంతా నిద్రకోసం కుస్తీపడి మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుని ఉంటారు. ఆ సమయానికి మీ తలకింద దిండు సరిగ్గా ఉంచుకోకపోతే అది మెడ కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అదేవిధంగా మీరు నిద్రించే విధానం కూడా సరిగ్గా లేనపుడు మీ శరీరబరువు అంతా ఒక భాగంపై పడి ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో మీరు నిద్ర లేచేసరికి ఆ ప్రాంతాల్లో నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుంది. దీనిని సరిచేయాలంటే అందుకు యోగా ఒక ప్రభావవంతమైన పరిష్కార మార్గంగా ఉంటుంది.
కొన్ని యోగా భంగిమలు పట్టేసిన కండరాలను వదులుగా చేసి వాటిని మళ్లీ పూర్వ స్థితిలోకి తీసుకురావటానికి సహాయపడతాయి. మీకు ఒళ్లు నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి ఎలాంటి యోగా భంగిమలు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకోండి.
క్యాట్- కౌ పోజ్
మీ శరీరానికి కొంత విరామం అవసరం అయినపుడు ఈ క్యాట్- కౌ భంగిమలో ఉంటే కండరాలకు మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. క్యాట్- కౌ భంగిమను యోగా భాషలో చక్రవాకాసనం అని అంటారు. ఉన్నచోటనే చేతులు, మోకాళ్లపై నిల్చుని మెడను పైకి కిందకు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇది వెన్నెముక, పక్కటెముకలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. సమతుల్యతను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పి ఉన్నవారు కొద్ది సేపు ఈ యోగా స్ట్రెచెస్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
సైడ్ స్ట్రెచ్
సౌకర్యంగా కూర్చొని చేసే సైడ్ స్ట్రెచ్ లను యోగాలో పార్శ్వ సుఖాసనం అని పిలుస్తారు. మెడ, చేతులు, మొండెం, తుంటి భాగాలకు విశ్రాంతినివ్వటానికి సైడ్ స్ట్రెచెస్ గొప్పగా పనిచేస్తాయి. ఉన్న చోటున సౌకర్యంగా కూర్చుని భుజాలను చాచుతూ ఎడమవైపు స్ట్రెచ్ చేయాలి, అలాగే కుడివైపు స్ట్రెచ్ చేయాలి. ఇది నిల్చుని కూడా చేయవచ్చు.
చైల్డ్ పోస్
దీనిని బాలాసనం అంటారు. ఈ విశ్రాంతి భంగిమలో 30 సెకన్ల పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఇది అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీపు, వెన్నెముకకు విశ్రాంతినిస్తుంది అలాగే భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ యోగా భంగిమ కోసం, మీ మడమల మీద కూర్చుని మోకరిల్లండి. ముందుకు వంగి, మీ నుదిటిని చాపకు ఆనించండి. మీ చేతులను ముందుకు చాచండి. మీ ఛాతీని తొడల దగ్గరకు తీసుకుని వంగండి. లోతైన శ్వాస తీసుకోండి.
లెగ్స్ అప్ ది వాల్ పోజ్
దీనినే విపరీత కరణి ఆసనం అంటారు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. గోడకు దగ్గరగా వెల్లకిలా పడుకోండి. గోడపైకి కాళ్లు లేపి ఉంచండి, మీ వీపు భాగం నేలను తాకేలా ఉంచండి. చేతులను వదులుగా పక్కలకు ఉంచండి. లోతైన శ్వాస తీసుకోండి. ఈ భంగిమలో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉండండి. ఇది మెడ , భుజాలకు విశ్రాంతినిస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సంబంధిత కథనం