Yoga for Thyroid Health। ఈ యోగాసనాలతో థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టండి!
Yoga for Thyroid Health: థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, యోగా ఈ పరిస్థితిని సహజంగా, సమర్థవంతంగా నియంత్రిస్తుంది. కొన్ని యోగా భంగిమలను ఇక్కడ తెలుసుకోండి.
Yoga for Thyroid Health: దాదాపు మూడింట ఒక వంతు భారతీయులు థైరాయిడ్ సంబంధిత సమస్యలను అనుభవిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి, ఈ థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే ఎక్కువ స్త్రీలకు ఉంటాయి. దీని వలన వారు హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ సమస్యలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి హైపోథైరాయిడిజం అనగా శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కానప్పుడు సంభవించే పరిస్థితి, మరొకటి హైపర్ థైరాయిడిజం, ఇది థైరాయిడ్ హార్మోన్ అధిక స్థాయిలో ఉత్పత్తి అయినపుడు సంభవించే పరిస్థితి. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని వివిధ జీవక్రియ చర్యలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, కానీ ఈ హార్మోన్ ఉత్పత్తిలో అసాధారణతలు మొత్తం శరీర విధులకు అంతరాయం కలిగిస్తుంది.
థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, యోగా ఈ పరిస్థితిని సహజంగా, సమర్థవంతంగా నియంత్రిస్తుంది. హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అక్షర యోగా సంస్థల వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్, థైరాయిడ్ సమస్యను అధిగమించడానికి కొన్ని యోగా భంగిమలు, జీవనశైలి అలవాట్లను సూచించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
ఉష్ట్రాసనము లేదా ఒంటె భంగిమ
ఉష్ట్రాసనం (Camel Pose) అనేది ఉదర ప్రాంతంతో సహా శరీరం ముందు భాగం మొత్తాన్ని విస్తరించే ఒక ఉత్తేజకరమైన భంగిమ. నేలపై మోకరిల్లి, రొమ్ము విరిచి, మీ చేతులను మీ దిగువ వీపుపై ఉంచి చేసే భంగిమ ఇది. ఇది థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరచడంతో పాటు వీపును బలపరుస్తుంది. అంతేకాకుండా ఉష్ట్రాసనము సాధన పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజపరిచేందుకు, పెల్విక్ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి, భుజాలలో ఒత్తిడిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఒంటె భంగిమను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది.
హలాసనము
హలాసనము దీనినే నాగలి భంగిమ అని పిలుస్తారు. వెల్లకిలా పడుకొని, రెండు కాళ్లను దగ్గరగా జరిపి, కాళ్లను నేరుగా 180 డిగ్రీలలో మీ తలవెనుకకు తీస్తుకు రావాలి. ఇది కాళ్లను సాగదీసి, విశ్రాంతినిచ్చే, బలపరిచే యోగా భంగిమ. ఈ ఆసనంలో మెడ విస్తరించి, పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంధులను ఉత్తేజపరుస్తుంది. హైపో థైరాయిడ్ ఉన్నవారు, ఈ ఆసనం వేసి చాలా ప్రయోజనకరం. అయితే, హైపర్ థైరాయిడిజం ఉన్నవారు ఈ భంగిమను పాటించకూడదు ఎందుకంటే ఈ భంగిమలో థైరాయిడ్ హార్మోన్ల స్రావం జరుగుతుంది కాబట్టి హైపర్ థైరాయిడిజం మరింత పెరుగుతుంది.
పశ్చిమోత్తనాసనం
ఈ భంగిమ సాధన చేసేందుకు, దండాసనంతో మొదలుపెట్టండి. ముందుగా శ్వాస పీల్చుకోండి, ఆపై శ్వాస వదులుతూనే ముందుకు వంగి మీ శరీర పైభాగం మీ శరీర కిందిభాగంపై ఆనేలా ఉంచండి. ఇప్పుడు మీ చేతులు మీ కాలి వేళ్లను ఆనించేలా చూడండి. మీ ముక్కు మీ మోకాళ్లకు ఆనించాలి. కొద్దిసేపు ఈ భంగమలో ఉండాలి. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఈ ఆసనం సాధన చేస్తుండటం ద్వారా పరిస్థితి మెరుగవుతుంది.
ఆహారపు అలవాట్లు
యోగాతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఎలాంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలో చూడండి.
ఫైబర్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి. ఇంట్లో తయారుచేసిన భోజనం తినడానికి ప్రాధాన్యతనివ్వండి.
· పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి, కానీ ద్రాక్ష, అరటిపండ్లు, మామిడి పండ్లను నివారించండి.
· బియ్యం, నూనె, మసాలా ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ , ప్రాసెస్డ్ ఫుడ్ తినడాన్ని పరిమితం చేయండి.
ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా ప్రత్యామ్నాయంగా స్కిమ్డ్ మిల్క్‌ను ఎంచుకోండి
· థైరాయిడ్‌తో కలిసి పనిచేసే అడ్రినల్ గ్రంధులకు మద్దతుగా ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించండి.
· మొత్తం హార్మోన్ల సమతుల్యత, శ్రేయస్సును పెంచడానికి ప్రతి రాత్రి 8 నుండి 10 గంటల నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి.
సంబంధిత కథనం