ఆశ్వయుజ మాసం వచ్చిందంటే తెలంగాణలో ఒకవైపు బతుకమ్మలు, మరోవైపు నవరాత్రి ఉత్సవాలతో ప్రతి పల్లె, పట్టణంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఏకకాలంలో ఈ రెండు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలు ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ వేడుకలు ఆడపడుచుల ఉనికికి, వారి ఆత్మగౌరవానికి ప్రతీక. పువ్వుల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగ. పది రోజుల పాటు వాకిళ్లలో అందమైన ముగ్గులు వేసి, రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి, వాటి మధ్యలో బతుకమ్మను ఉంచి, ప్రత్యేకమైన బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడతారు.
బతుకమ్మ వేడుకల్లో పువ్వులే ప్రధానం. దేవతలను కొలిచేందుకు పువ్వులను ఉపయోగిస్తాం, కానీ ఆ పువ్వులనే దేవతగా ఆరాధించడం ఈ పండుగ గొప్పతనం. మరి బతుకమ్మ వేడుకల కోసం ఎలాంటి పువ్వులను వినియోగించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
బతుకమ్మ అనేది స్వచ్ఛమైన మనసులతో ఆరాధించే పండగ. ఈ పండగ కోసం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం పంటపొలాలలో లభించే సాధారణ పువ్వులను, సీజనల్‌గా లభించే పువ్వులనే వినియోగిస్తారు. ఈ సీజన్‌లో రకరకాల రంగుల పూలు వికసిస్తాయి. అందులో కొన్ని సువాసనలు కలిగి ఉంటాయి, మరికొన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటితో పేర్చిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కూడా పరిశుభ్రం అవుతుంది. తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మలో ఎలాంటి పువ్వు ఎలాంటి విశిష్టతను కలిగి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
బతుకమ్మను పేర్చటానికి గునుగు పూలు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఈ పాడి పంట గట్ల వెంబడి లభిస్తాయి. గునుగు శాస్త్రీయ నామం సెలోసియా. ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న గడ్డిజాతి పుష్పం. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. గాయాలు నయం చేయటానికి, మధుమేహం, చర్మ సమస్యల నివారణకు ప్రసిద్ధి.
తంగేడు అనేది తెలంగాణ రాష్ట్ర పుష్పం. అంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా బతుకమ్మను పేర్చడంలో ఉపయోగించే ప్రధానం పుష్పం. దీని శాస్త్రీయ నామం సెన్నా ఆరిక్యులాట. తంగేడు అనేక ఔషధ గుణాలను కలిగిన పుష్పం. నాటు వైద్యంలో మలబద్ధకం, మధుమేహం, ఇతర మూత్రనాళ సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు.
ఈ పూల గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇంటి అలంకరణల కోసం తోరణాలుగా, దేవునికి పూల దండల కోసం ఉపయోగిస్తాం. వీటిని బతుకమ్మల కోసం ఉపయోగిస్తారు. ఇవి చర్మ సమస్యలను నివారించే గుణాలను కలిగి ఉంటాయి.
మల్లె పూలు, లిల్లీపూలను కూడా ఉపయోగిస్తారు. వీటిని బతుకమ్మను పేర్చేటపుడు పైవరుసల్లో ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించటం వలన అందంగా కనిపిస్తుంది, ఆ పరిసరాలు మొత్తం సువాసనలు వెదజల్లుతాయి.
చిన్నగా చిట్టి చామంతి లాగే రోడ్డు పక్కన గడ్డిలో మొలిచే గడ్డిపువ్వు కూడా బతుకమ్మలో భాగమే. ఈ పువ్వులో యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలుంటాయి. గాయాలు మాన్పడానికి, రక్తస్రావం ఆపడానికి, జుట్టుకు పోషణ కోసం గిరిజనులు ఈ గడ్డిపూలనే ఉపయోగిస్తారు.
ఇంకా బీరపువ్వు, దోస పువ్వు, గుమ్మడి పువ్వులు, వాము పూలు వంటి కూరగాయ మొక్కల పువ్వులు, అలాగే తామరపువ్వు, గన్నేరు పువ్వు, కట్ల పువ్వు సహా ఈ కాలంలో స్థానికంగా విరబూసే ఏ పువ్వునైనా బతుకమ్మకు ఉపయోగిస్తారు.
సంబంధిత కథనం